మండలి రద్దు విషయంలో తెలుగుదేశం పార్టీ కేంద్రం మీదే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మండి రద్దు ప్రక్రియలో తన వంతు పని పూర్తి చేసింది. తీర్మానం ఢిల్లీకి వెళ్లినట్టే. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ వాళ్లు ఈ తీర్మానాన్ని అడ్డుకుంటారన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చారు. మండలి రద్దు అప్పుడే అయిపోలేదని తెలుగుదేశం వాళ్లు చెబుతున్నారు. ఒకరేమో రద్దుకు ఆరు నెలలు పడుతుందంటే.. ఆ సమయాన్ని ఆరారు నెలలుగా పెంచుతూ.. మూడేళ్లు పడుతుంది అనేంత వరకూ వెళ్లిపోయారు పచ్చచొక్కాల వాళ్లు.
అయితే ఈ సమయానికి సరైన లెక్కలు ఏవీ లేవు. పార్లమెంట్ ముందు చాలా పెండింగ్ తీర్మానాలు ఉంటాయనే అభిప్రాయాలే తప్ప.. మండలి రద్దు తీర్మానం ఢిల్లీలో లేట్ కచ్చితంగా అవుతుందనే ప్రామాణికాలు ఏమీ లేవు. కేవలం బీజేపీ వాళ్లు ఆ తీర్మానాన్ని కావాలని పక్కన పెడితే తప్ప..మిగతా వ్యవధి సహజంగా అయ్యేదే.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తిదాయకమైన రీతిలో స్పందించారు. మండలి రద్దు తీర్మానం చట్టబద్ధమైనదని ఆయన అన్నారు. ఆ తీర్మానాన్ని ఆమోదించకుండా.. కావాలని ఆపి ఉంచే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనప్పుడు మండలి రద్దు తీర్మానం ఢిల్లీలో ఆమోదం పొందడం ఖాయమే అని స్పష్టం అవుతోంది. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఢిల్లీలో జగన్ కు సహకారం అందదు అనే అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జీవీఎల్ వ్యాఖ్యాలు వారికి రుచించేలా లేవు.