పేరుకు హైదరాబాదీనే అయినా సైనా నెహ్వాల్ మూలాలు మాత్రం హర్యానాతో ఉంటాయి. హైదరాబాద్ లో సెటిలైన ఒక హర్యానీ కుటుంబానికి చెందిన క్రీడాకారిణి సైనా. బ్యాడ్మింటన్లో సత్తా చూపించిన ఈమె ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరారు సైనా.
ఈ సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశంసించారు. మోడీని హార్డ్ వర్కర్ గా అభివర్ణించారు. ఆయన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అన్నారు. బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను సైనా ప్రశంసిస్తూ ఉన్నారు. ఇది వరకూ కూడా ట్విటర్ ద్వారా ఈమె కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
ప్రత్యేకించి ఇప్పుడే సైనా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంలో కొంత ఆసక్తిదాయకమైన రాజకీయమే ఉంది. ఒకవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సైనాను బీజేపీ చేర్చుకుంది. ఢిల్లీలో సెటిలైన హర్యానా ఓటు బ్యాంకును ఆకర్షించడానికే సైనాను బీజేపీ ఇప్పుడు చేర్చుకుందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆప్ లో హర్యానీ మూలాల హవా ఎక్కువ. కేజ్రీవాల్ కూడా ఆ నేపథ్యం గల వ్యక్తే. మరి ఒకవైపు దేశం తరఫున ఆటలో కొనసాగుతూనే..సైనా ఇలా పాలిటిక్స్ లోకి వచ్చింది. ఆటలో గత కొన్నాళ్లుగా ఆమె ఫామ్ కూడా అంత గొప్పగా లేదు.