నాకు 20వేల లీటర్ల పెట్రోల్ కావాలి: కొడాలి నాని

తన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ మంత్రి కొడాలి నాని ఓపెన్ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి కొంతమంది టీడీపీ, జనసేన నేతలు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని హడావుడి…

తన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ మంత్రి కొడాలి నాని ఓపెన్ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి కొంతమంది టీడీపీ, జనసేన నేతలు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని హడావుడి చేయడం మొదలుపెట్టారు. పెట్రోల్ తన దగ్గర రెడీగా ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటావంటూ నానిని రెచ్చగొట్టడం షురూ చేశారు.

ఇలాంటి వాళ్లందరికీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు మంత్రి. వాళ్లు డబ్బాతో పెట్రోల్ తెస్తే, తను మాత్రం ఏకంగా 20వేల లీటర్ల పెట్రోల్ లారీని తెప్పిస్తానని అన్నారు కొడాలి నాని.

“టీడీపీ నాయకులు కొంతమంది పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరుగుతున్నారు. జనసేన నేతలు కూడా కొందరు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరుగుతున్నారు. నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వాళ్లు నాకు పెట్రోల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, 420 బ్యాచ్ ను తగలబెట్టడానికి 20వేల లీటర్ల పెట్రోల్ లారీ తీసుకురావాలి. ఈ సన్నాసుల కోసం నేను ఏకంగా పెట్రోల్ లారీ తీసుకొస్తాను.”

ఇలా తనపై జోకులేసే వాళ్లందరి నోళ్లు మూయించారు మంత్రి. క్యాసినో విషయంలో ఎల్లో మీడియా ఎలా మాట మారుస్తోందో దశలవారీగా వివరించారు మంత్రి. ప్రస్తుతం చంద్రబాబు ఛానెళ్లు తన కల్యాణ్ మండపం పేరు ఎత్తడం మానేశాయని ఎద్దేవా చేశారు.

“నా కల్యాణమండపంలో క్యాసినో పెట్టానని మొన్న చంద్రబాబు మీడియా చెప్పింది. ఈ 420 ఛానెళ్లు నిన్నటికి మాట మార్చాయి. నా కల్యాణమండపం సమీపంలో పెట్టారని అంటున్నారు. ఈరోజు వార్తల్లో క్యాసినో గుడివాడలో జరిగిందంటున్నారు. నా కల్యాణ మండపం ప్రస్తావన తీసేశారు. నా రెండున్నర ఎకరాల కల్యాణమండపం ప్రాంగణంలో క్యాసినో జరిగినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను. దెబ్బకు చంద్రబాబు ఛానెళ్లన్నీ మాట మార్చేశాయి. నా కల్యాణ మండపం పేరు ఎత్తడం లేదు.”

తనకు, సీఎం జగన్ కు మధ్య అగాథం సృష్టించడానికి చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి. వచ్చే ఎన్నికల్లో జగన్ తనకు సీటు ఇవ్వకపోయినా, తను తన కుటుంబం మొత్తం జీవితాంతం జగన్ విధేయులుగానే ఉంటామని స్పష్టం చేశారు మంత్రి.