పీఆర్సీ జీవోలపై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇవి ఏపీ ఉద్యోగులకు షాక్ ఇచ్చేవే. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. న్యాయస్థానానికి వెళితే ప్రభుత్వానికి అక్షింతలు తప్పవని ఉత్సాహ పడిన ఉద్యోగులకు …అందుకు రివర్స్ కావడం గమనార్హం. ఏపీ హైకోర్టు సీరియస్ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను జారీ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నూతన పీఆర్సీతో తమ వేతనాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని, తమ వేతనాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరపున రవితేజ వాదించారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్ని తగ్గిస్తోందంటూ గట్టిగా వాదించారు. ఎలాంటి నోటీసులు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమన్నారు. ప్రభుత్వం ఎంత తగ్గిస్తున్నదో చెప్పాలని హైకోర్టు కోరింది. ఇదే సందర్భంలో ఉద్యోగుల జీతాన్ని తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని హైకోర్టు సంచలన వ్యాఖ్య చేసింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు తగ్గుతున్నాయా లేక పెరుగుతున్నాయా? అనేది అంకెల్లో చూపాలని కోరింది.
అంతేకానీ, ప్రభుత్వానికి వేతనాలు తగ్గించే హక్కు లేదనడాన్ని కొట్టి పడేసింది. ఈ సందర్భంగా పూర్తి సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించింది. అయినా పీఆర్సీని సవాల్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించడం గమనార్హం.
అలాగే హెచ్ఆర్ఏ విభజన చట్టప్రకారం జరగలేదన్న పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తున్నట్టు పిటిషనర్ చేస్తున్న వాదనల్లో నిజం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఒకవైపు సమ్మె నోటీసులు ఇస్తూ, మరోవైపు పిటిషన్ వేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.
అసలు ఈ పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకుంటూ విచారణ అర్హత, వేతనాల వివరాలు, ఇతరత్రా అంశాలపై సమగ్ర వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.