ఉద్యోగులు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇంకా సరిపోలేదు అని ఉద్యమాలు చేస్తున్నారు. సరిగా పని చేయరు, జీతం మాత్రం కావాలి.
ఇదీ YSRCP సమర్దకులు సోషల్ మీడియా లోనూ, YSRCP సొంత పత్రిక సాక్షి లోనూ వస్తున్న వార్తలు.
పైగా YSRCP ప్రభుత్వం వాలంటీర్ లను ఉపయోగించి ప్రజల వద్దకు పంపి ఉద్యోగులపై నెగటివ్ ప్రచారాన్ని కల్పిస్తుంది. ఏమైనా అంటే రాష్ట్ర పరిస్థితి బాలేదు అని గోల ఒకటి.
అసలు రాష్ట్ర పరిస్థితి బాలేక పోవడానికి కారణం ఎవరు? ఉద్యోగస్తులా?? తమ అధికారం కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా పంచడం వలన కదా రాష్ట్రం ఈ స్థితికి వచ్చింది. చంద్రబాబయినా, జగన్ అయినా చేసింది, చేస్తుంది అదే కదా. కాకపోతే జగన్ హయాంలో ఈ పంచడం హద్దులు దాటింది. రాజకీయ నాయకులు చేసిన తప్పుకి ఉద్యోగులను బలి పెట్టడం ఎంతవరకు న్యాయం?
ఉద్యోగస్తులు మాత్రమే లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారా? ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా లక్షల్లోనే ఆఫీషల్ గా జీతభత్యాలు తీసుకుంటున్నారు కదా. వారి చేసే అవినీతి గురుంచి అసలు ఇక్కడ నేను మాట్లాడడం లేదు.
మరి వారెందుకు తమ జీతాలు తగ్గించుకోరు? జగన్ గారు తన జీతాన్ని తగ్గించుకుని, అలాగే తమ మంత్రులు, MLA, MP ల జీతాలు కూడా తగ్గించి అవి రాష్ట్రానికి ఇస్తే కొంతైనా ఉపయోగం ఉంటుంది కదా. ఆ తర్వాత ఉద్యోగస్తులకు చెబితే కనీసం అప్పుడైనా వారు వినే అవకాశం ఉంటుంది.
సలహాదారులు అంటూనే దేశంలో ఎక్కడా, ఏ ముఖ్యమంత్రికి లేనంత మందిని తెచ్చుకుని వారికి లక్షల్లో అప్పజెప్పుతూ ఇప్పుడు ఉద్యోగస్థుల జీతాలు తగ్గించుకోమంటే ఎలా? ఉద్యోగులు సరిగా పని చేయకపోతే ఆ తప్పు కూడా ప్రభుత్వాల మీదనే పడుతుంది. వీరికి ఉద్యోగులతో సరిగా పనిచేయించడం చేతకాదు అని అంటారు అందరూ.
ఉద్యోగస్థుల మీద నెగటివ్ ప్రచారం చేయడం ప్రభుత్వం ఎత్తుగడ లా కనిపిస్తుంది. నిజానికి ఉద్యోగస్తుల కన్నా రాజకీయ నాయకుల మీద ఇంకా ఎక్కువ నెగటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో ఉంది. వారు ఏ పార్టీ వారైనా అవ్వొచ్చుగాక.
అసలు ఉద్యోగస్తుల మీద వైసీపీ కి ఎందుకంత చులకన భావం?? మొన్న సచివాలయ ఉద్యోగస్తుల మీద కూడా ఇలానే నోరు పారేసుకున్నారు. మేమిచ్చిన జాబ్స్ మీవి అని.
ఊరికినే ఇచ్చారా? పోటీ పరీక్ష పెట్టి అందులో ఎన్నికైన వారినే కదా తీసుకున్నారు. మరి ఊరికే ఇచ్చినట్లు పోజులు ఏంటి?? ఏ ఉద్యోగస్థుడైనా పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో నెగ్గాకే జాబులు తెచ్చుకుంటారు. దానికి తగ్గ చదువు, అర్హతలు సంపాదించుకుంటారు. ఆ తర్వాతనే వారిని ఉద్యోగాలు వరించేవి. కొంత మందికి అమ్మ, నాన్న లేదా భర్త చనిపోతే జాబ్స్ రావచ్చు. అయితే అవి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అని మనం గుర్తు పెట్టుకోవాలి.
గతంలో నేను వేసిన రోడ్ల పై మీరు తిరగొద్దు అంటూ గొప్పలకు పోయారు చంద్రబాబు గారు. ఫలితం గా అధికారం ఊడపీకి ప్రక్కన కూర్చుండబెట్టారు ప్రజలు ముఖ్యంగా ఉద్యోగస్తులు.
గత ఎన్నికల్లో టీడీపీ ని ఓడించడానికి, వైసీపీ ని గెలిపించడానికి ఉద్యోగస్తులు ఎంత కష్టపడ్డారో మనకందరికీ తెలుసు. విషయాన్ని పెర్సనల్ గా తీసుకుని మరీ పని చేసారు.
మరి వారిని కదిలించి తల బిరుసుగా ప్రవర్తిస్తే వైసీపీ అధికారం కోల్పోడానికి ఎంత సమయం పట్టొచ్చు??
అయినా ఈ రాజకీయ నాయకులకు ఎందుకంత అహం? జగన్ పార్టీ మేము ఇచ్చే ఉద్యోగాలు అంతుంది, మోడీ పార్టీ మేము ఇచ్చే బియ్యం అంటుంది. ఇక బాబయితే అన్ని నావే నావే అంటారు. వీల్లేమైనా తమ జేబుల నుండి తీసి ప్రజలకు పంచుతున్నారా? ప్రజల సొమ్మే కదా!
ఉద్యోగస్తుల వాదన లో న్యాయం ఉంది. దీనిని సామరస్యంగా ప్రభుత్వం పరిష్కరించాలి. మొండిగా పోతే ప్రభుత్వానికి బొప్పి కట్టడం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వం చాలా విషయాల్లో దుందుడుకు గా పోయింది. అవన్నీ ఒకటి సైడ్, ఈ సమస్య ఒక్కటీ ఒక సైడ్. దీనిని సరిగా టాకిల్ చేయకపోతే వైసీపీ కి రాబోయే కాలంలో ప్రమాదమే. టీడీపీ ని మరీ తక్కువగా అంచనా వేస్తున్నట్లు ఉంది వైసీపీ. చివరి క్షణంలో కూడా చక్రం తిప్పగల సామర్థ్యం ఇంకా బాబు కి ఉంది. అది గుర్తెరిగి ఉండడంలోనే వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
భాస్కర్ కిల్లి