సుప్రీంలో విచార‌ణ‌…గ‌వ‌ర్న‌ర్ కీల‌క నిర్ణ‌యం!

బిల్లుల పెండింగ్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చే రోజు తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కొన్ని బిల్లుల్ని ఆమోదించ‌డంతో పాటు మ‌రికొన్నింటిని తిప్పి పంప‌డం గ‌మ‌నార్హం. బిల్లుల్ని సుదీర్ఘ కాలం పాటు…

బిల్లుల పెండింగ్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చే రోజు తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కొన్ని బిల్లుల్ని ఆమోదించ‌డంతో పాటు మ‌రికొన్నింటిని తిప్పి పంప‌డం గ‌మ‌నార్హం. బిల్లుల్ని సుదీర్ఘ కాలం పాటు త‌న వ‌ద్దే పెట్టుకోవ‌డంపై తెలంగాణ స‌ర్కార్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. 

బిల్లుల‌ను ఆమోదించ‌కుండా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌జాస్వామ స్ఫూర్తికి వ్య‌తిరేకంగా ఉందని, అలాగే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు పూర్తిగా విరుద్ధంగా వుందంటూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్ర‌భుత్వం ఆశ్ర‌యించింది.

గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ప‌ది బిల్లులు పెండింగ్‌లో ఉన్న విష‌యాన్ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం దృష్టికి స‌ర్కార్ తీసుకెళ్లింది. విధిలేని ప‌రిస్థితిలో బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని కేసీఆర్ స‌ర్కార్ ఆ పిటిష‌న్‌లో పేర్కొంది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్‌లో ప్ర‌స్తావించింది.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేవ‌లం మూడు బిల్లుల‌కు మాత్రమే గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మ‌రో రెండు బిల్లులను పెండింగ్‌లోనే పెట్టారు. దీంతో వివాదం ఇంకా స‌జీవంగా ఉన్న‌ట్టైంది.

సుప్రీంకోర్టులో విచార‌ణ చేప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో… గ‌వ‌ర్న‌ర్‌లో తాజా క‌ద‌లిక వ‌చ్చింద‌ని బీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. అది కూడా త‌న వైపు త‌ప్పు లేకుండా చేసుకోడానికే త‌ప్ప‌, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు గ‌వ‌ర్న‌ర్‌కు ఏ మాత్రం ప‌ట్ట‌డం లేద‌ని అధికార పార్టీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సుప్రీంకోర్టు స్పంద‌న ఉత్కంఠ రేపుతోంది.