తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాస్త ప్రజాదరణ కలిగిన నాయకులను చేర్చుకోడానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సస్పెండ్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ఇద్దరు నేతలు సస్పెన్షన్‌కు గురి కావడమే ఆలస్యం, అప్పుడే వారితో బీజేపీ ముఖ్య నాయకులు టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.
బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్ విషయాన్ని తెలంగాణ బీజేపీ నేతలు తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. జూపల్లితో బీజేపీ కీలక నాయకులు డీకే అరుణ, బండి సంజయ్ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. కలిసి పనిచేద్దామని, తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది.
చాలా కాలంగా పొంగులేటి, జూపల్లి బీఆర్ఎస్ అధినాయకుడు, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఇద్దరు నేతలు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తూ వచ్చింది. అయితే వాళ్లిద్దరి విమర్శలు శ్రుతి మించాయన్న ఉద్దేశంతో సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో బీఆర్ఎస్‌తో వాళ్లిద్దరికీ బంధం తెగిపోయినట్టే అనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తమ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్ వుంటుందని, తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని డీకే అరుణ, బండి సంజయ్ వారితో అన్నట్టు తెలిసింది. పొంగులేటి మాత్రం సొంత కుంపటి పెడతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ పెట్టడం కంటే, ఆల్రెడీ బలోపేతం అవుతున్న బీజేపీలో చేరడం మంచిదనే నిర్ణయానికి ఆయన వస్తారా? అనే చర్చ జరుగుతోంది.
పొంగులేటి బీజేపీలో చేరితే మాత్రం ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి మంచిరోజులు వచ్చినట్టే. ఎందుకంటే ఏమీ లేని చోట బలమైన నాయకుడి రాక బీజేపీకి వరమని చెప్పొచ్చు. జూపల్లి రాక కూడా కొద్దోగొప్పో కలిసొస్తుందని బీజేపీ భావన.