ఓ టాప్ హీరో బర్త్ డే కు శుభాకాంక్షలు చెప్పాలంటే ఎంతయినా ఖర్చు చేస్తారు నిర్మాతలు. హీరోల గుడ్ లుక్స్ లో వుండాలి అంటే ఆ మాత్రం ఖర్చు చేయాలి కదా. నాని బర్తే డే అంటే చాలు నిర్మాత వెంకట్ బోయనపల్లి మీడియాలో ప్రకటనలు కుమ్మేస్తారు. ప్రతి ఏటా..అది ఆయనకో సరదా. ఇలా రకరకాల విన్యాసాలు చేసి హీరోలకు అభినందనలు చెప్పే నిర్మాతలు చాలా మంది వున్నారు.
టాప్ హీరో బన్నీ బర్త్ డే మొన్నటికి మొన్న జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ అమెరికాలో శుభకాంక్షలు తెలిపారు. పీపుల్స్ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన ఆతిథ్యానికి, ఆర్థికానికి పడిపోని హీరో వుండరు. ప్రభాస్ డేట్ లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా ఇచ్చారు. చిరంజీవి కబురు చేసారు. మహేష్…బన్నీ కూడా ఇస్తారేమో?
ఇంతకీ బన్నీకి విశ్వప్రసాద్ ఎలా శుభాకాంక్షలు తెలిపారు. ఓ విమానానికి పే…ద్ద బ్యానర్ కట్టేసి. దాని మీద బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదేమీ కష్టమైన, రేర్ ఫీట్ కాదు. కానీ కాస్త ఖర్చవుతుందంతే. అమెరికాలో ఇలాంటి పని కోసమే కొన్ని విమానాలు రెడీగా వుంటాయట. నిమషాల లెక్కనో, గంటల లెక్కనో చార్జ్ చేస్తాయట.
ఇప్పుడు బన్నీ బాబుకి చెప్పిన శుభాకాంక్షల ఖర్చు పద్దు జస్ట్ అయిదు వేల నుంచి ఆరువేల డాలర్లు అంట. అంటే దాదాపు అయిదారు లక్షలు అన్న మాట. ఎన్ని బొకేలు వచ్చేవో..ఎంత మంది అనాధలకు అన్నదానం చేయొచ్చో. కానీ ఈ కిక్కు వేరు కదా? ఇలాంటి వాటికే కదా హీరోలు పడిపోయేది. ఈ సూక్ష్మం తెలిసిన వారే టిజి విశ్వప్రసాద్. అందుకే షార్ట్ టైమ్ లో పీపుల్స్ మీడియా బ్యానర్ అంత పాపులరైపోయింది.