సెలబ్రిటీల ప్రసంగం అంటే ఓ ఫ్లో వుంటుంది. అందులోనూ కీరవాణి లాంటి వారికి అది సహజం. ఎందుకంటే కీరవాణికి ఇంతో అంతో సాహితీ పరిచయం వుంది. పాటకే కాదు ఆయన మాటకీ ఓ ట్యూనింగ్ అనేది వుంటుంది. ఆ ట్యూన్ తప్పితే, ప్రసంగం కాస్తా పంటి కింద రాయిలా మారుతుంది. నిన్నటికి నిన్న ఆర్ఆర్ఆర్ అభినందన సభలో కీరవాణి ప్రసంగం ఇలాగే మారింది.
నిజానికి చాలా గొప్పగా ప్రసంగం ప్రారంభించారు కీరవాణి. తాను, చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలము మాత్రమే అని, అసలు క్రెడిట్ రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ లదే అని చెప్పేసారు. అది పూర్తిగా కాకున్నా కొంత వరకు నిజం కూడా. పాట కు మంచి క్యాచీ ట్యూన్ ఇవ్వడం అన్నది ఎంత ప్లస్ పాయింట్ నో, అంత క్రేజీ డ్యాన్స్ మూవ్ మెంట్స్ సమకూర్చడం అంతకు అంతా ప్లస్ పాయింట్. అసలు ఆ స్టెప్స్ వల్లనే పాట భాషతో సంబంధం లేకుండా అందరికీ రీచ్ అయింది.
అంతే కాదు, అవార్డుకు తాను పొంగిపోవడం లేదని కూడా కీరవాణి చాలా గొప్పగా చెప్పారు. జీవితంలో ఎన్నో హై..లో సంఘనటలను చూసాక ఇలా రుషిగా మారిపోవడం సహజం. అందువల్ల అక్కడ కూడా కీరవాణి కరెక్టే. కానీ ఉన్నట్లుండి ‘మా ఆవిడ చెబుతుంటుంది..బతికితే ఓ రోజు అయినా రామోజీ రావు లా బతకాలాని’ అనడం మాత్రం అక్కడ అస్సలు అతకలేదు. ఆ మాటలు తప్పు..ఒప్పు అన్నది కాదు పాయింట్ ఇక్కడ. ఆ ఫ్లో లో అది వున్నట్లుండి వచ్చింది.
తాను రామోజీని కలిసినపుడు అని స్టార్ట్ చేసి వున్నా ఫ్లో మిస్ అయ్యేది కాదు. అప్రస్తుత ప్రసంగం అన్నట్లు సడెన్ గా రూట్ మారి అటు వెళ్లారు.
పైగా రామోజీ…ఆస్కార్ తీసుకురండి అన్నాక తెలిసిందట ఆస్కార్ కు వున్న వాల్యూ. రామోజీ రావు ఆస్కార్ కు అంత విలువ ఇస్తున్నారు అంటే దానికి ఏదో వుండే వుంటుంది అనుకున్నారట. ఆస్కార్ కు ఏముందో తెలియకుండానే రాజమౌళి అటు దృష్టి పెట్టారా? అన్ని కోట్లకు కోట్లు ఖర్చు చేసారా? చూస్తుంటే క్రెడిట్ లో ఓ పైసా వాటా రామోజీరావు కూడా కూడా ఇవ్వాలని కీరవాణి అనుకున్నారా? లేదా బతికితే రామోజీరావులా ఓ రోజైనా బతకాలని చెప్పడం ద్వారా ఆయన ఎంత గొప్పవాడో చాటాలానుకున్నారా?
ఇటీవల రామోజీ రావు మీద ఆంధ్రలో గడబిడ జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు పరోక్ష మద్దతు ఇవ్వాలని, ఆయనెంత గొప్పవాడో చెప్పాలని కీరవాణి ఈ రాంగ్ రాగం ఎంచుకున్నారా? ఏమో..ఏతా వాతా..మహానుభావుల మనోగతాలు మనకు తెలిసేవి కావు..వెనుక గూఢార్ధాలు…నిగూర్ధాలు..చాలా వుంటాయి.