తిరుమలంటే నుదుట మూడు నామాలు గుర్తుకొస్తాయి. అయితే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఈవో ధర్మారెడ్డి పంగనామాలు పెట్టారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. చైర్మన్ కోటాలో ప్రతి రోజూ ఇచ్చే సుపథం (రూ.300 టికెట్) దర్శనాల్లో చైర్మన్ భారీ కోత విధించారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యుల సిఫార్సులను పరిగణలోకి తీసుకుని దర్శనాలు కల్పించలేకపోతున్నట్టు టీటీడీ చైర్మన్ కార్యాలయ అధికారులు వాపోతున్నారు.
ప్రతి రోజూ చైర్మన్ కోటాలో సుపథం టికెట్లు సుమారు 3 వేలు ఇచ్చేవారు. ప్రతినెలా టీటీడీ సుపథం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసే సంగతి తెలిసిందే. ఇవి కాకుండా టీటీడీ చైర్మన్ కోటాలో సుపథం టికెట్లను ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సిఫార్సులకు అనుగుణంగా దర్శనాలు కల్పిస్తున్నారు. అయితే గత నెల 23 నుంచి ఆకస్మికంగా వీటిలో భారీ కోత విధించడం విమర్శలపాలవుతోంది.
ప్రస్తుతం ఆ కోటా ప్రతిరోజూ 400కు పడిపోయిందంటే దర్శనాల్లో ఏ మేరకు కోత విధించారో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో కొండపై రద్దీ లేని సమయంలో ఎందుకు సుపథం దర్శనాల్లో కోత విధించారనే ప్రశ్నకు టీటీడీ ఈవో నుంచి సరైన సమాధానం లేదని చైర్మన్ కార్యాలయ అధికారులు అంటున్నారు.
తిరుమలలో రద్దీ సమయంలో దర్శనాల్లో కోత విధించి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తే ఎవరికీ ఇబ్బంది లేదని, ఇందుకు అందరూ సహకరిస్తారనేది చైర్మన్ కార్యాలయ అధికారుల మాట. కానీ అలాంటి పరిస్థితులేవీ లేకుండానే దర్శనాల్లో కోత విధించడం ద్వారా సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా దర్శనాలు ఇవ్వలేదని చైర్మన్‌ను చెడ్డ చేసే కుట్ర కనిపిస్తోందనే ఆవేదన వారిలో కనిపిస్తోంది.
అసలు సుపథం దర్శనాల్లో కోత విధించడానికి గల కారణాలను చైర్మన్‌కు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈవో ధర్మారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు అధికార పార్టీకి ఆగ్రహం తెప్పించేలా వున్నాయనే చర్చకు తెరలేచింది. ఇందుకు తాజా ఉదాహరణ సుపథం దర్శనాల్లో కోత విధించడమే.