జనాల్లో ఫీవర్ సర్వే.. రాజకీయాల్లో పీకే సర్వే!

తెలంగాణలో ప్రస్తుతం ఫీవర్ సర్వే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంటింటికి వెళ్లి కరోనా రోగుల్ని ట్రేస్ చేయడం, అక్కడికక్కడే ఐసొలేషన్ కిట్లు అందించడం ఈ సర్వే ఉద్దేశం. దీనికి సమాంతరంగా రాజకీయంగా మరో సర్వే…

తెలంగాణలో ప్రస్తుతం ఫీవర్ సర్వే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంటింటికి వెళ్లి కరోనా రోగుల్ని ట్రేస్ చేయడం, అక్కడికక్కడే ఐసొలేషన్ కిట్లు అందించడం ఈ సర్వే ఉద్దేశం. దీనికి సమాంతరంగా రాజకీయంగా మరో సర్వే నడుస్తోంది. అదే ఏరివేత సర్వే. 

అవును.. ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థతో తెలంగాణ అంతటా పొలిటికల్ సర్వే మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల నాడి ఎలా ఉండబోతోంది? ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎంతమందిని కొనసాగించాలి, ఎంతమందిని ఇంటికి పంపించాలనేది దీని ఉద్దేశం. ప్రస్తుతం ఈ రెండు రకాల సర్వేలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికలకు సరిగ్గా ఏడాదిన్నర టైమ్ ఉంది. మొన్నటివరకు కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రిగా ఫుల్ టెర్మ్ పనిచేయాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్. ముందస్తుకు వెళ్లే కంటే, ఈ టైమ్ ను పార్టీ రిపేర్లకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారాయన. సేమ్ టైమ్, వరుస పర్యటనలతో క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నారు.

దళిత బంధుతో పాటు మరో కొత్త పథకం..?

గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పరిస్థితి కేసీఆర్ జేజారిపోయిందని చెప్పలేం కానీ, కచ్చితంగా అది మెజారిటీపై ప్రభావం చూపించడం గ్యారెంటీ అని తేలిపోయింది. దీనికితోడు 50శాతానికి పైగా ఎమ్మెల్యేలు, 30శాతం మంది మంత్రులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కేసీఆర్ కు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది.

అందుకే, ఈ అంశాలన్నింటిపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఓవైపు సర్వే నిర్వహిస్తూనే, మరోవైపు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని దళితబంధు పథకాన్ని చాకచత్యంగా తెరపైకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. హుజూరాబాద్ ఉప ఎన్నిక టైమ్ లోనే తెరపైకొచ్చిన ఈ పథకాన్ని, వచ్చే ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో వాడుకోవాలని భావిస్తున్నారు. 

అందుకే ఈ పథకం, దీనికి సంబంధించి డెవలప్ మెంట్స్ ఎప్పటికప్పుడు మీడియాలో నలిగేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీంతోపాటు ఎన్నికల టైమ్ కు మరో ఆకర్షణీయ పథకంతో ప్రజల ముందుకు వచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి.

మరో ఈటల బయటకు రాకూడదు..

మరోవైపు ప్రశాంత్ కిషోర్ టీమ్ క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వే ఆధారంగా.. అభ్యర్థుల ఎంపిక, ఏరివేత ప్రక్రియను మొదలుపెట్టబోతున్నారు కేసీఆర్. సీటు పక్కా అనుకునే ఎమ్మెల్యేలు, మంత్రులకు కాస్త ముందుగానే ఆ సమాచారం అందించి ఆ దిశగా ఎన్నికల కోణంలో మరింత చురుగ్గా పనిచేయమని చెప్పబోతున్నారు. వేటు వేసే నేతలను నేరుగా పీకి పడేయకుండా, వాళ్లకు ప్రత్యామ్నాయం కల్పించి, ఎన్నికల నాటికి పార్టీ కోసం వాడుకోవాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో చెలరేగే అసమ్మతిని తగ్గించుకునేందుకు, ఈ ఏడాది కాలాన్ని వెచ్చించాలని భావిస్తున్నారు కేసీఆర్. ఈటల తరహాలో మరో నేత పార్టీ నుంచి బయటకెళ్లి, పక్కలో బల్లెంలా మారడం కేసీఆర్ కు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈసారి టికెట్ నిరాకరించే అభ్యర్థులను కాస్త ముందుగానే బుజ్జగించి తన వద్ద ఉంచుకోవాలని చూస్తున్నారాయన.

మొత్తమ్మీద తెలంగాణలో రాజకీయ వేడి ఊపందుకుంది. బీజేపీకి అందనంత వేగంగా వ్యూహాలు రచించి, ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. అటు బీజేపీ మాత్రం టీఆర్ఎస్ నుంచి ఎంతమంది జంప్ జిలానీలు తమవైపు వస్తారా అని ఎదురుచూస్తోంది.