ఒక్క సారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే చాలు… జీవితాంతం ప్రజల్ని, ప్రభుత్వాల్ని పీడించుకుని సౌఖ్యాల్ని అనుభవించొచ్చు అనే రీతిలో వారి వ్యవహారం ఉంటోందని పౌర సమాజం విమర్శిస్తోంది. నూతన పీఆర్సీ తమకు నచ్చలేదని, అలాగని మరికొన్ని డిమాండ్లను ఉద్యోగ సంఘాల నాయకులు తెరపైకి తెచ్చారు. జగన్ ప్రభుత్వ వైఖరిని నిరసనగా సమ్మెలోకి దిగేందుకు ఇవాళ ప్రభుత్వానికి నోటీసు కూడా ఇవ్వనున్నారు. ఉద్యోగుల హక్కుల్ని ఎవరూ కాదనరు. కానీ వచ్చిన చిక్కల్లా బాధ్యతల విషయంలోనే.
ఏనాడైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో ఉద్యోగులు చిత్తశుద్ధి, నిబద్ధత ప్రదర్శించారా? అనేది ఇప్పుడు పౌర సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్న. ఉద్యోగులకు సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు…మంచోచెడో వారి పనితీరుపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఎంతసేపూ ప్రభుత్వం తమకు అది చేయాలి, ఇది చేయాలనే డిమాండ్లను నిత్యం తెరపైకి తెస్తూ, ఉద్యమాల పేరుతో విధులకు ఎగనామం పెట్టాలనే తపనే ఉద్యోగుల్లో కనిపిస్తుంటుంది. తన కుటుంబం లగ్జరీగా జీవితాన్ని లీడ్ చేయడానికి సమాజం ఓ ఉద్యోగం కల్పించిందని, ఇందుకు ప్రజల రుణాన్ని తీర్చుకోవాలనే కృతజ్ఞతా భావం ఎంత మంది ఉద్యోగుల్లో ఉంది?
తాము తీసుకుంటున్న వేలు, లక్షలాది రూపాయల జీతానికి ఏ మేరకు న్యాయం చేస్తున్నారో ఉద్యోగులు ఏనాడైనా ఆత్మ పరిశీనల చేసుకున్నారా? ఎంత సేపూ పే రివిజన్, ఇంకో రివిజనో తప్ప, తమ అంతరాత్మల్ని రివిజన్ చేసుకుంటున్న ఉద్యోగులెవరూ కనిపించడం లేదు. అలాంటి వాళ్లెవరైనా ఉంటే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గొంతుపై ఈ విధంగా కత్తి పెట్టి బెదిరింపులకు దిగి వుండేవారు కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై పౌర సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉద్యోగుల పనితీరు, వారి రోజువారీ కార్యకలా పాలపై నెటిజన్లు సృజనాత్మకంగా తమ వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో తమపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతపై ఉద్యోగులు ఖంగుతిన్నారు. తమను తిట్టించడం దారుణమని వాపోతున్నారు. ఈ నా కొడుకులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించడానికా జనం ట్యాక్స్‌లు కట్టేదని గత సార్వత్రిక ఎన్నికల ముందు ఉద్యోగుల గురంచి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఓ మీడియా సంస్థ అధిపతి… ఇప్పుడు ఉద్యోగులపై అధికార పార్టీ సోషల్ మీడియాలో దాడి చేయిస్తోందని మొసలి కన్నీళ్లు కార్చడం అది పెద్ద జోక్.
ఏ డిపార్ట్మెంట్లో ఏ పనికి ఎంతెంత లంచం తీసుకుంటారో జనానికి బాగా తెలుసు. అందుకే లంచాలు భారీగా ఉంటే, ఇక జీతాలెందుకు? అనే ప్రశ్నలు ఎదురుకావడం. ఇక ఉపాధ్యాయుల బాధ ప్రత్యేకం. ఒక్క తాము తప్ప, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరూ సాయంత్రం ఇంటికెళ్లే సమయానికి ఎంతోకొంత లంచం జేబులో వేసుకుని వెళతారని, అందువల్లే నూతన పీఆర్సీకి తాము ఒప్పుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో లంచం తీసుకునే స్వభావం పెరిగిందని చెబుతూనే, మరోవైపు సోషల్ మీడియాలో తిట్టడం ఏంటనే ప్రశ్నలు ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి రావడం ఆశ్చర్యం ఉంది.
తాము విమర్శలకు అతీతులమనే భావన నుంచి ముందుగా ఉద్యోగులు బయటికి రావాలి. ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్సులతో లక్షలాది రూపాయలను జీతాలుగా తీసుకుంటున్న ఉద్యోగులు సమాజానికి, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండి తీరాల్సిందే. చిన్న పని చేయాలన్నా చేయి తడపకుండా ఫైల్‌ను ముందుకు కదిలించని ఉద్యోగులు ఎందరు లేరు? అదే విషయాన్ని ప్రజలు నిలదీస్తే మాత్రం ఉద్యోగ సంఘాల నాయకులకు తప్పుగా కనిపిస్తోందా? ఇదెక్కడి విడ్డూరం. ఉద్యోగులను మళ్లీమళ్లీ నిలదీస్తూనే వుంటారు. ఎందుకంటే ఉద్యోగాన్ని సేవా వారధిగా భావించినంత కాలం… ప్రజలకు, తమకు పోరు నడుస్తూనే ఉంటుందని ఉద్యోగులు గుర్తించాలి.