ఏపీలో నిన్నమొన్నటివరకు జరిగిన కథే ఇది. ఇప్పుడు తెలంగాణలో కూడా రిపీట్ అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియా పెట్టాలని నిర్ణయించారు. ఏపీలో సీఎం జగన్ ఇదే ప్రకటన చేసినప్పుడు ఎలాంటి విమర్శలు వచ్చాయో.. సరిగ్గా తెలంగాణలో కూడా అవే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలుగుభాష చచ్చిపోతుందని కొందరు, ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అని మరికొందరు, పాఠశాలల్లో మౌలికవసతుల సంగతేంటంటూ ఇంకొందరు.. ఇలా ఎవరి వాదనలు వాళ్లు బయటపెడుతున్నారు. అసలు ఇవన్నీ పక్కనపెట్టి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం సౌలభ్యం దొరికిందంటూ.. పాజిటివ్ గా ఎందుకు ఆలోచించరు?
ఇంగ్లిష్ మీడియం అనివార్యం..
ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలు ఎవరెవరు ఏ ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్నారనే లెక్క తీస్తే కచ్చితంగా 10నుంచి 15శాతం మంది కంటే ఎక్కువ ఉండరు. ఈ లాజిక్ తీస్తే.. రాజకీయ నాయకుల పిల్లలేమైనా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారా అనే ప్రశ్న వినపడుతోంది. పోనీ అక్కడికే వద్దాం.. రాజకీయ నాయకులైనా, అధికారులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, ఆఖరికి ప్రభుత్వ టీచర్లయినా.. తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటారు.
అందుకే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు ఎక్కువ అయినా భరిస్తారు, ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే విని మురిసిపోతారు. మరి ఇదే ఇంగ్లిష్, పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తే మిగతావారికి ఏంటి నొప్పి. ప్రపంచమంతా ఇంగ్లిష్ మీడియం వైపు పరుగులు తీస్తే, పేద విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా చదువుకునేవారికి ఆ అవకాశం వద్దని ఎందుకంటున్నారు..?
ప్రైవేట్ విద్యార్థులతో పోటీ పడాలన్నా, కాంపిటీటివ్ పరీక్షల్లో రాణించాలన్నా ఇంగ్లిష్ తప్పదు. కొలువు కావాలంటే చదువు కంటే ముందు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ చూసే రోజులివి. ముందు ఇంగ్లిష్ మీడియం పెట్టనివ్వండి, బాలారిష్టాలు ప్రతి విషయంలో ఉంటాయి, ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్దాం. సమస్య వస్తే ఎత్తిచూపుదాం. అంతేతప్ప, ఆదికి ముందే ఎందుకీ అడ్డుపుల్లలు. ఇలా మోకాలడ్డి ఏం సాధిస్తారు? విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేయడం తప్ప.
అందుకే అందరం పాజిటివ్ గా ఆలోచిద్దాం. అది తెలంగాణ అయినా, ఏపీ అయినా. తెలుగు ఉంటుంది, ఇంగ్లిష్ కు కూడా ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
తెలుగును చంపేది ఎవరు..?
భాషను చంపే ధైర్యం ఎవరికైనా ఉందా..? అసలా అవకాశం ఉందా..? స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే తెలుగు చచ్చిపోతుందని అనుకోవడం అవివేకం. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నా.. తెలుగులోనే సంభాషించుకుంటారు పిల్లలు.
తెలుగు సినిమాలే చూస్తారు, తెలుగు పాటలే వింటారు. తెలుగు టీవీ ఛానెల్సే చూస్తారు. మరి తెలుగెక్కడ చచ్చిపోతుంది. మరుగుజ్జు ఆలోచనలు ఉన్న బ్యాచ్ మాత్రం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం అనే పాయింట్ దగ్గరే ఆగిపోయింది. ఇన్నాళ్లూ అక్కడే ఆగిపోయాం, ఇకనైనా ప్రభుత్వాలకు కొత్త ఆలోచన వచ్చింది, కనీసం దీన్నయినా స్వాగతిద్దాం.