ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు జబర్దస్త్ కామెడీ షోకు మించిన ప్రదర్శన చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి సంప్రదింపుల కమిటీ ఆహ్వానిస్తే, తిరస్కరించడమే కాకుండా… విడ్డూరమైన కండీషన్ పెట్టారు. పీఆర్సీ సాధన సమితి నేతలకు ప్రభుత్వం చర్చల నిమిత్తం ఆహ్వానం పంపింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చించుకుందాం…రాండి అని ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వం పిలిచింది.
పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయమై ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చి చెప్పడం గమనార్హం. ఉద్యోగ సంఘాల నాయకులు ఏ స్థాయిలో బెదిరింపులకు దిగారో ఇంతకంటే చెప్పుకోడానికి ఏం కావాలి? ఎక్కడైనా సమస్య తలెత్తితో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడం సంప్రదాయం. కానీ తాము సంప్రదింపులకు మాత్రం వెళ్లకుండానే, ప్రభుత్వం తనకు తానుగా పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేసినట్టు ప్రకటించాలనే ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను చూస్తుంటే… వారు ఎంత గర్వంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తే… అప్పుడు కూడా ప్రభుత్వంతో చర్చల విషయమై ఆలోచిస్తామని ప్రకటించడం దేనికి నిదర్శనం? తద్వారా ఎలాంటి సంకేతాల్ని ప్రజానీకానికి, ప్రభుత్వానికి పంపాలని అనుకుంటున్నారో ఉద్యోగులకే తెలియాలి. పెళ్లయితే పిచ్చి నయమవుతుందని అంటే… ముందు పిచ్చి బాగైతే కదా ఎవరైనా పిల్లనివ్వడానికి అని పెద్దలు చమత్కరిస్తుంటారు. ఇదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది.
పీఆర్సీపై ప్రభుత్వం ఏమనుకుంటున్నది? ఉద్యోగుల అసంతృప్తి తెలిసిన తర్వాత ప్రభుత్వ ఆలోచనల్లో ఏమైనా మార్పు వచ్చిందా? తదితర విషయాలు తెలియాలంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సి వుంటుంది. అలా కాకుండా అసలు పీఆర్సీ ఉత్తర్వులనే రద్దు చేశాకే, తాము చర్చలకు వెళతామంటే… ఇదెక్కడి పద్ధతి? ప్రజలకు సేవలు అందించడానికి తాము తప్ప, మరొక గత్యంతరం లేదనే ఏకైక కారణమే ఉద్యోగులను నియంతలుగా మారుస్తోందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరపకుండా, ఏ రీతిలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారో ప్రజానీకానికి చెప్పాలి.
అయినదానికి, కానిదానికి సమ్మెకు దిగడం, ప్రభుత్వాల్ని బెదిరించి పబ్బం గడుపుకోవాలనే అసహజ ధోరణలుకు ఫుల్‌స్టాప్ పడేదెన్నడు? ప్రభుత్వం ఉండేది కేవలం తమ డిమాండ్లు తీర్చేందుకే అన్నట్టు ఉద్యోగుల వైఖరి ఉంది. ఇదే ఉద్యోగులపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. కావున ఉద్యోగం అంటే వ్యాపారం కాదని, సేవని గుర్తించిన వారెవరూ ఇలా బెదిరింపు చర్యలకు దిగరనే విమర్శలు పౌర సమాజం నుంచి వెల్లువెత్తుతున్నాయి.