గెలుపా? కులమా? ఏది ముఖ్యం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. విభేదాలు మరచిపోయి ముందుకు వెళ్లకపోయినట్లయితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ హెచ్చరించినప్పటికీ.. పార్టీ నాయకుల తీరు పెద్దగా మారినట్టు…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. విభేదాలు మరచిపోయి ముందుకు వెళ్లకపోయినట్లయితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ హెచ్చరించినప్పటికీ.. పార్టీ నాయకుల తీరు పెద్దగా మారినట్టు లేదు. పైకి తీవ్రంగా కనపడకపోయినా.. ఏదో ఒక ముసలం పుడుతూనే ఉంది. 

తాజాగా బీసీలకు ఎక్కువ టికెట్లు కావాలనే గొడవ టాప్ గేర్ కు మారుతోంది. చాలా రోజులుగా ఈ డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్న తెలంగాణ బీసీ నాయకులు తాజాగా రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేను కలవడానికి కూడా పూనుకోవడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ.. ఈ రాష్ట్ర ప్రజల ఆదరణను చూరగొనడంలో కాంగ్రెసు పార్టీ విఫలం అయింది. రెండు దఫాలు భారాసకే ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈసారైనా అధికారాన్ని హస్తగతం చేసుకోకపోతే.. ఇక మరోసారి గెలుపు గురించి ఆశించడం కూడా కష్టమేననే భయం ఆ పార్టీ నాయకుల్లో ఉంది. అందుకే ముఠాకక్షలకు పేరుమోసిన కాంగ్రెసు పార్టీ ఈసారి సమైక్యంగా ఎన్నికలు ఎదుర్కోవడానికి వ్యూహరచన చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు కాస్త శాంతిస్తున్నాయి గానీ.. కొత్తగా బీసీ కులాల నుంచి బెడద పుట్టుకు వచ్చింది.

ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం రెండేసి వంతున బీసీలకు కేటాయిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ సారథులు ప్రకటిస్తున్నారు. అలా చేసినా కూడా.. భారాసకంటె కాంగ్రెస్ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు అవుతుందనేది వారి వాదన. అయితే కాంగ్రెసులో బీసీల డిమాండ్ విచిత్రంగా ఉంది. 

ఒక్కో ఎంపీస్థానంలో మూడేసి వంతున.. మొత్తం కనీసం 50 స్థానాలు బీసీలకు ఇవ్వాలనేది వారి డిమాండుగా ఉంది. 50 స్థానాలు కేటాయిస్తే.. గెలుపు గుర్రాలుగా భావించే చాలా మంది నాయకులకు టికెట్ దక్కకుండా పోయే పరిస్థితి వస్తుందనేది సీనియర్ల వాదన!

అయితే తెలంగాణ కాంగ్రెసులో రెడ్డి సామాజిక వర్గం పెత్తనం అధికంగా ఉన్నదని.. వారికి తగ్గించి బీసీలకు ఇవ్వాలని బీసీ నాయకులు కోరుతున్నారు. ఇదే డిమాండ్ తో వారు మాణిక్ రావు వద్దకు కూడా వెళుతున్నారు. ఎన్నికల సమయంలో, అది కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్న క్లిష్టమైన ఎన్నికల సమయంలో, గెలిచే వారికి మాత్రమే టికెట్లు ఇచ్చి అందరూ సహకరించాలి. 

కానీ.. బీసీలు.. గెలుపు కంటె కులమే ముఖ్యం అంటూ బీసీ కార్డును ప్రయోగించడం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. భారాసకంటె ఎక్కువ సీట్లు ఇస్తున్నప్పటికీ కూడా రాద్ధాంతం చేయడం సరికాదని.. పలువురు భావిస్తున్నారు. పార్టీని ముందు గెలిపించుకుంటే.. తర్వాత.. కులాలవారీ అన్యాయం జరగకుండా ఇతర పదవులను పంచుకోవచ్చుననే కొందరి వాదన చాలా మందికి రుచించడం లేదు.