ఆఫ్‌లైన్ వ‌ద్దు…ఆన్‌లైన్ ముద్దు గురూ!

తెలంగాణ‌లో బ‌డులు తెరిచేందుకు ప్ర‌భుత్వం సుముఖంగా లేదు. ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకే ప్ర‌భుత్వం మొగ్గు చూపింది. ఈ మేర‌కు తెలంగాణ పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ దేవ‌సేన స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.  Advertisement తెలంగాణ‌లో తిరిగి…

తెలంగాణ‌లో బ‌డులు తెరిచేందుకు ప్ర‌భుత్వం సుముఖంగా లేదు. ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకే ప్ర‌భుత్వం మొగ్గు చూపింది. ఈ మేర‌కు తెలంగాణ పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ దేవ‌సేన స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. 

తెలంగాణ‌లో తిరిగి బ‌డులు తెరిచే వ‌ర‌కూ 7 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ సోమ‌వారం నుంచి ఆన్‌లైన్‌, దూర విద్య క్లాసులు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది 50 శాతం మంది రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో హాజ‌రు కావాల‌ని పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ దేవ‌సేన ఆదేశాలు ఇచ్చారు.

నిజానికి ఆఫ్‌లైన్‌లో త‌ర‌గ‌తులు ప్రారంభించొచ్చ‌నే ఆశ‌తో ప్ర‌భుత్వం ఎదురు చూసింది. ముందుగా ఈ నెల 8 నుంచి 16వ తేదీ వ‌ర‌కూ ప్ర‌భుత్వం సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో ఈ నెల 30వ తేదీ వ‌ర‌కూ సంక్రాంతి సెల‌వుల‌ను విద్యాశాఖ పొడిగించింది. 31 నుంచి తిరిగి త‌ర‌గ‌తులు ఆఫ్‌లైన్‌లో ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. అయితే కేసులు త‌గ్గ‌క‌పోగా, రోజురోజుకూ పెరుగుతుండ‌డంతో త‌న నిర్ణ‌యాన్ని విద్యాశాఖ స‌మీక్షించింది.

ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇంటింటి స‌ర్వేలో కోవిడ్ కేసులు, ల‌క్ష‌ణాలున్న విద్యార్థుల సంఖ్య భారీగా ఉన్న‌ట్టు వెల్ల‌డ‌వుతుండ‌డంతో ఆన్‌లైన్ త‌ర‌గతుల వైపే విద్యాశాఖ మొగ్గు చూపింది. మ‌రోవైపు పాఠ‌శాల‌లు తెరిచినా త‌ల్లిదండ్రులు పంప‌రనే కార‌ణంతో ఆన్‌లైన్‌లో నిర్వ‌హ‌ణ‌కు విద్యాశాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. 

కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ‌డులు మూసివేత‌కు అంగీక‌రించ‌మ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ ఎక్క‌డైనా పాఠ‌శాల‌ల్లో క‌రోనా వ్యాపించి ఉంటే, వాటిని మాత్ర‌మే క్లోజ్ చేయాల‌ని ఏపీ విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.