గతంలో ఒక్క దినపత్రిక చదివితే సమాజంలో ఏం జరుగుతోందో తెలిసిపోయేది. టెలివిజన్ చానెళ్లు వెయ్యి కాళ్ళ జెర్రిలా పెరిగిపోకముందు ప్రజలకు దినపత్రికలే పెద్ద దిక్కు. తరువాత కాలంలో ఏదో ఒక్క టీవీ చూస్తే ఏం జరుగుతున్నదో తెలిసేది. కానీ ఎప్పుడైతే మీడియా అంటే దినపత్రికలు, టీవీ చానెళ్లు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళాయో అప్పటి నుంచే సమాజంలో ఏం జరుగుతున్నదో అర్ధం కాక గందరగోళం, అయోమయం ఏర్పడ్డాయి. జుట్టు పీక్కునే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఒక్కటి కాదు అయిదారు దినపత్రికలు చదివినా వాస్తవాలు అంతుబట్టవు. ఇందుకు ప్రధాన కారణం రాజకీయ పార్టీల అధినేతలు మీడియా సంస్థలు (పత్రికలు, ఛానళ్ళు) స్థాపించడం ఒకటైతే, అప్పటికే నడుస్తున్న పత్రికలను, చానెళ్లను నయానో, భయానో చేజిక్కించుకోవడం మరొకటి. కొన్ని మీడియా సంస్థలు వివిధ కారణాలతో అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తడం మరొకటి. తెలంగాణలో అధికారంలో టీఆరెస్ కు సొంతంగా దినపత్రిక, టీవీ ఛానెల్ ఉండగా, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కొన్ని పత్రికలను కూడా టేకోవర్ చేసింది.
అలాగే టీవీ చానెళ్లు కూడా. అంటే గులాబీ పార్టీ నాయకులు వాటిని సొంతం చేసుకున్నారన్న మాట. అలాగే ఏపీలో అధికారంలో ఉన్న వైకాపాకు సొంతంగా పత్రిక, టీవీ ఛానెల్ ఉన్నాయి. సేమ్ తెలంగాణలో మాదిరిగానే కొన్ని పత్రికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో కూడా కొన్ని పత్రికలు ప్రతిపక్షాల వైపు ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. కానీ ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే ఏపీలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సమ్మెకు దిగారు. ఇంకా కొన్ని విభాగాలవారు దిగబోతున్నారు.
టీడీపీ అనుకూల, వైకాపా వ్యతిరేక మీడియాగా పేరుబడిన ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో సమ్మె వార్తలు పుంఖానుపుంఖాలుగా ప్రచురించారు. ఆంధ్రజ్యోతి చూస్తే ఏమిటీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపిస్తుంది. అదే సాక్షి చూస్తే సమ్మె ఊసే లేదు. రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న భావన కలుగుతుంది. ఏపీలో అభినవ సాక్షిగా, తెలంగాణలో నమస్తే ప్రభగా పేరు పొందిన ఆంధ్రప్రభలో కూడా సమ్మె ఊసు లేదు.
సమాజంలో ఏం జరుగుతున్నదో సామాన్యులకు వాస్తవాలు తెలియవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. సరే …వాస్తవాలు తెలుసుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. మీడియా స్వతంత్రంగా వ్యవహరించాలనేది పుస్తకాల్లో ఉండే థియరీ మాత్రమే. కానీ వాస్తవంగా రాజకీయ నాయకుల, పార్టీల చేతుల్లో బందీగా ఉంది.
జ్యోతి పాఠకులకు ఏపీ అల్లకల్లోలంగా అనిపిస్తే, సాక్షి పాఠకులకు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. భక్తుడు భగవంతుడిని ఏ అవతారంలో కొలిస్తే ఆ అవతారంలో కనబడతాడు అన్నట్లుగా పాఠకుడు ఏ పత్రికను లేదా మీడియాను ఫాలో అయితే సమాజం ఆ విధంగానే కనిపిస్తుంది.