23… ఈ సంఖ్యకు టీడీపీకి ఉన్న సెంటిమెంట్ తెలిసిందే. టీడీపీకి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఇవి. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారిపోతున్నా.. టీడీపీని ట్రోలింగ్ చేయాలంటే 23ని గుర్తు చేయక మానరు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు.. వైసీపీ నుంచి లాగేసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇదే కావడంతో దేవుడు వారికి 2019లో 23 సీట్లు మాత్రమే వచ్చేలా చేశారని, అది విధి అని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికీ టీడీపీకి 23వ నెంబర్ సెంటిమెంట్ కి ఏదో లింక్ వెదికి మరీ ట్రోలింగ్ చేస్తుంటారు నెటిజన్లు.
అదే సంఖ్య ఇప్పుడు మరోసారి ట్రెండ్ అయింది.. ఈరోజు 23వ తేదీ.. పైగా లోకేష్ పుట్టినరోజు. దీంతో మరోసారి ట్రోలింగ్ మొదలైంది. లోకేష్ తండ్రి వైసీపీ నుంచి లాగేసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య, లోకేష్ పుట్టినరోజు, ఫైనల్ గా టీడీపీకి వచ్చిన స్కోరు అంతా ఒకటేనని, ఆ సంఖ్య టీడీపీకి అలా అచ్చొచ్చిందని ఆటాడేసుకుంటున్నారు.
ఇది మరో సెల్ఫ్ ట్రోలింగ్..
23వతేదీ లోకేష్ పుట్టినరోజు కావడమే పెద్ద ట్రోలింగ్ పాయింట్ అయితే, ఇప్పుడు ''హేళన చెక్కిన శిల్పం'' అనేది మరో సెల్ఫ్ ట్రోలింగ్ పాయింట్ గా మారింది. ఐ-టీడీపీ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసుకుంది టీడీపీ. ఆ ట్విట్టర్ అకౌంట్ లో లోకేష్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. “హేళన చెక్కిన శిల్పానికి జన్మదిన శుభాకాంక్షలు!” అనే క్యాప్షన్ పెట్టారు.
అరె.. ఏంట్రా ఇది అంటూ.. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. 'హేళన చేయకు బ్రో..' అనే మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. చంద్రబాబు శిల్పాన్ని చెక్కుతున్నట్టు.. బాహుబలి రేంజ్ లో శిల్పం చెక్కబోతే.. అది బాబూ మోహన్ శిల్పంలా మారినట్టు అదిరిపోయే మీమ్స్ పెడుతున్నారు.
లోకేష్ పర్సనాల్టీని, ఆయన వాక్ చాతుర్యాన్ని.. వైసీపీ వాళ్లు హేళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి హేళన నుంచి ఆయన శిల్పంగా ఎదిగారనేది ఐ-టీడీపీ వాళ్ల స్లోగన్ తాత్పర్యం. కానీ బయటకు అది అలా రాలేదు. పరోక్షంగా తమ నాయకుడ్ని గట్టిగా హేళన చేసింది టీడీపీ టీమ్. హేళన చెక్కిన శిల్పం అయితే ఎమ్మెల్యేగా కూడా ఎందుకు ఓడిపోయారంటూ ట్రోలింగ్ చేస్తోంది వైరి వర్గం.
ఇక పుట్టినరోజుకి రెండ్రోజుల ముందే మంత్రి కొడాలి నాని కూడా అమ్మాయిల బొడ్డులో పుల్లలు పెట్టి తిప్పేవాడంటూ నారా లోకేష్ పై పెద్ద సెటైర్ పేల్చారు. కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న లోకేష్.. ఈ ఏడాది తన పుట్టినరోజును 'హేళన చెక్కిన శిల్పం'గా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట.