వరుసపెట్టి అడ్వాన్సులు తీసుకున్నాడు పవన్ కల్యాణ్. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలకు కొబ్బరికాయలు కూడా కొట్టాడు. అయితే ఎన్ని సినిమాలు ప్రకటించినా, ఒకేసారి రెండు సినిమాలకు మించి షూటింగ్స్ చేయలేకపోయాడు. వినోదాయ శితం, హరిహరవీరమల్లు.. భీమ్లానాయక్-హరిహరవీరమల్లు.. ఇలా ఒకేసారి 2 సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు.
ఇకపై ఇలా రెండేసి చేస్తే టైమ్ సరిపోదు. అందుకే మూడేసి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వినోదాయశితం రీమేక్ షూటింగ్ ఆల్రెడీ పూర్తవ్వడంతో.. ఇప్పుడు ఒకేసారి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాబ్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఇదే నెలలో సుజీత్ దర్శకత్వంలో ఓజీ కూడా మొదలవుతుంది. ఇక చాన్నాళ్లుగా ముక్కుతూమూలుగుతూ సాగుతున్న హరిహర వీరమల్లు షెడ్యూల్ ఉండనే ఉంది.
ఈ మేరకు 3 సినిమా యూనిట్లకు పవన్ సమాచారం అందించాడు. దీంతో ఎవరికివాళ్లు నెక్ట్స్ షెడ్యూల్స్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే పవన్ తన మార్క్ ట్విస్ట్ ఇచ్చాడు..
ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో ఉన్న ఈ హీరో.. నెక్ట్స్ ఏ సినిమాకు కాల్షీట్లు ఇవ్వబోతున్నాడనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ప్రస్తుతానికైతే ఓజీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే కనుక జరిగిదే చాన్నాళ్లుగా నలుగుతున్న హరిహర వీరమల్లు సినిమాకు పవన్ ప్రాధాన్యత తగ్గించినట్టవుతుంది.
ఏ సినిమా షెడ్యూల్ ముందుగా స్టార్ట్ అవుతుందనేది పక్కనపెడితే.. ఈ 3 సినిమాలూ సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయనేది మాత్రం వాస్తవం. ప్రస్తుతానికి పవన్ ప్లానింగ్ ఇదే.