ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తత్వం బోధ పడుతోందా? అంటే.. ఔననే సమాధానం వస్తోంది. మరీ ముఖ్యంగా జగన్ సర్కార్ ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించికపోగా, వారికేం చేశామో జనాలకు చెప్పాలని మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులను సీఎం ఆదేశించారు.
అలాగే కేబినెట్ సమావేశంలో సీఎం మరో కీలక వ్యాఖ్య చేశారు. ఉద్యోగుల డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాలంటే ఒక భారీ సంక్షేమ పథకాన్ని పక్కన పెట్టాల్సి వుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పక్కన పెట్టడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
దీంతో ఉద్యోగులపై ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయాన్ని మరింతగా జనంలో జగన్ నింపగలిగారు. ఇప్పటికే వేలు, లక్షలాది రూపాయలను జీతాలుగా తీసుకుంటున్న ఉద్యోగులు తమ పొట్ట కొట్టాలని చూస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఇప్పటికే ప్రజల్లో ఏ మాత్రం గౌరవం లేని ఉద్యోగులకు, జగన్ కామెంట్ మరింత నెగెటివిటీ పెంచుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఒక మెట్టు దిగి ప్రజలకు విన్నవించుకుంటున్నారు. మాకు పీఆర్సీ వద్దు అనే శీర్షికతో పలు అంశాలను రూపొందించి వివిధ మాధ్యమాల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లి… తమపై వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీ ఉద్యోగులు చేస్తున్న ఆ ప్రచారంలో ఏమున్నదంటే…
మాకు కొత్త PRC వద్దు …
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో… రాష్ట్రానికి మా వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుత డిసెంబర్-2021 జీతానికి పెండింగ్ DA లు ఇస్తే చాలు. దీనివల్ల రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు మిగులుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడే పీఆర్సీ ఇస్తే చాలు.
పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు వద్దు…58 ఏళ్లు చాలు. నిరుద్యోగ యవతకు మంచి రోజులు రావాలి. ఈ విషయమై ప్రభుత్వానికి సహకరిస్తాం! సామాన్య ప్రజలు ఇవన్నీ గమనించాలని కోరుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. తమ డిమాండ్లపై జగన్ సర్కార్ దిగిరాదని తెలిసి ….ఉద్యోగులు పునరాలోచనలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.