రియలెస్టేట్ వ్యాపారం మీద ఆశలు పెంచుకుని, ఎకరాలు కోట్ల రూపాయలు అవుతాయనే లెక్కలతో సాగిన అమరావతి ఉద్యమం, కరోనా వేళ ప్రజల జీవనమే కష్టం అయిపోయిన తరుణంలో కూడా.. కోరింది కోరినట్టుగా జరగాలని అంటున్న శ్రీమంతులు.. ప్రభుత్వ ఉద్యోగుల తరఫున.. ఇవీ పచ్చదళం తన గళాన్ని వినిపిస్తున్న అంశాలు!
ఎక్కడైనా ప్రతిపక్షం అంటే బలహీనుల పక్షంలో ఉంటాయి. అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం అయ్యాకా… రియలెస్టేట్ వ్యాపారంలా తమ భూముల విలువ గురించి పోరాడుతున్న వారికి, ప్రజలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వేళ కూడా ప్రజలు కట్టే పన్నుల నుంచి తాము పొందే జీతాలు మాత్రం ఘనమైన చదవింపుల్లా ఉండాలనే వారికి పచ్చ పార్టీ తన శక్తినంతా ధారపోసి పోరాడుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు స్వచ్ఛంద మద్దతు తెలిపారు. ఎక్కడిక్కడ టీడీపీ శ్రేణులు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పోయి గలాభా రేపడానికి ఆయన వ్యూహం రచించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఈ అంశంలో రాజకీయ పార్టీల మద్దతు వద్దన్నాయి. అయితే తమ బాబుగారు మద్దతు ప్రకటిస్తే వద్దంటారా.. అన్నట్టుగా కామ్రేడ్ నారాయణ లాంటి వాళ్లు ఉద్యోగుల తీరును తప్పు పట్టారు. తమను చేర్చుకోవాల్సిందే అంటున్నారాయన!
ఇక పచ్చ మీడియా ప్రభుత్వ ఉద్యోగుల తరఫున సమర శంఖం పూరిస్తోంది. పతాక శీర్షికల పోరాటం చేస్తూ ఉంది ఉద్యోగుల తరఫున. కరోనా పరిస్థితుల కారణంగా వందల మంది జర్నలిస్టుల ఉద్యోగాలు పోయాయి. అదే పచ్చ మీడియాలో జీతాల కోతను తీవ్రంగా వేశారు. నెలలో పదిహేను రోజుల పాటు పని చేస్తే చాలు, మిగతా రోజులు పని చేయనక్కర్లేదు, పదిహేను రోజులకే జీతం ఇస్తామంటూ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ పేపరు తమ ఉద్యోగుల జీతభత్యాలను కాస్తైనా కనికరం లేకుండా కోసింది.
ఎడాపెడా ఉద్యోగుల తొలగింపులు, జీతల కత్తిరింపులు. కరోనా పరిస్థితుల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఎంతో మంది చిరుద్యోగుల్లో జర్నలిస్టులు కూడా ముందు వరసలోని వారు. మూడు నాలుగేళ్లుగా కూడా జీతంలో పైసా పెరుగుదల లేకుండా పని చేస్తూ ఉన్న వారు కోకొల్లలు.
ఇలా సమాజంలో కరోనా వల్ల జీతభత్యాల విషయంలో దుర్భరావస్థను ఎదుర్కొంటున్న వారు కోకొల్లలుగా ఉంటే, జీతభత్యాల విషయంలో ఎవరూ పోటీ ఇవ్వలేని ప్రభుత్వ ఉద్యోగుల తరఫున పచ్చ పోరాటం సాగుతూ ఉంది. కరోనా కారణంగా ఉపాధి పోయిన వారి విషయంలోనూ, ఆఖరికి జర్నలిస్టుల విషయంలోనో చిన్న కథనం ఇవ్వలేని పత్రికలు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం బాకాలు ఊదుతున్నాయి. తామే సమరశంఖం పూరిస్తున్నాయి. ఇదీ పచ్చ దుర్మార్గానికి పరాకాష్ట!
ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులపై పచ్చ పత్రికల యాజమాన్యాలకు ప్రేమ ఏమీ కారిపోవడం లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తోక పత్రిక అధిపతి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఏమన్నాడో వీడియో సాక్ష్యమే ఉంది. ప్రజలు పన్నులు కడుతోంది ఆ నాకొడుకుల జీతాలకా.. అంటూ ఆయన అప్పుడు ప్రశ్నించారు. అయితే ఇప్పుడు సీట్లో ఉన్నది చంద్రబాబు కాదు కాబట్టి.. ఉస్కో ఉస్కో అంటున్నారు. ఇదీ లెక్క!