ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది అశ్వథ్థామ. తమ సినిమాలో పవన్ కల్యాణ్ ఉన్నాడంటున్నాడు హీరో నాగశౌర్య. పవన్ వాయిస్ తోనే సినిమా స్టార్ట్ అవుతుందని చెబుతున్నాడు. పవన్ వాయిస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చాడు.
“మా సినిమా పవన్ కల్యాణ్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. ఆయన గోపాల గోపాలలో అశ్వథ్థామ గురించి ఓ డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ నాకు స్ఫూర్తినిచ్చింది. అందుకే మా సినిమాను గోపాల గోపాలలో పవన్ చెప్పిన అశ్వథ్థామ డైలాగ్ తో స్టార్ట్ చేశాం. నిర్మాత శరత్ మరార్ అనుమతి తీసుకొని ఆ డైలాగ్ పెట్టాం. పవన్ కనిపించరు, కేవలం బ్యాక్ గ్రౌండ్ లో ఆయన డైలాగ్ మాత్రం వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరో పాత్రకు ఆ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ నిర్వచనంగా మారుతుంది. అందుకే పెట్టాం.”
సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు అశ్వథ్థామ కాదంటున్నాడు శౌర్య. కేవలం కథను దృష్టిలో పెట్టుకొని ఆ టైటిల్ పెట్టామని తెలిపాడు. ఇక హీరో క్యారెక్టరైజేషన్ విషయానికొస్తే, అత్యంత సహజంగా, చాలా జెన్యూన్ గా ఉంటుందంటున్నాడు.
“హీరోకు సంబంధించిన ప్రతి సన్నివేశం జెన్యూన్ గా రాశాను. అన్నీ నిజజీవితంలో జరిగినవే. నేను విన్నది, బాధితులు చెప్పింది మాత్రమే సినిమాలో పెట్టాం. ఈ కథ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్, ఢిల్లీ లాంటి ఎన్నో ఏరియాలు తిరిగాను. అయితే విలన్ పాత్ర రాసుకున్నప్పుడు మాత్రం ఒకటే అనిపించింది. మేం రాసుకున్న విలన్ పాత్రకంటే నీచకమైన, క్రూరమైన మనుషులు బయట ఉన్నారనిపించింది. మేం రాసిన విలన్ పాత్ర చాలా తక్కువ అనిపించింది.”
అశ్వథ్థామకు కథ రాసిన నాగశౌర్య, ఇకపై కూడా కథలు రాస్తానంటున్నాడు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై బయట హీరోతో నెక్ట్స్ మూవీ ఉంటుందంటున్న శౌర్య.. తన కథతోనే వేరే హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తానంటున్నాడు.