పిల్లల చదువులతోనూ ఈనాడు పరాచకాలు

ఏపీలో పాఠశాలల పునఃప్రారంభంపై టీడీపీ అనుకూల మీడియా ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. స్కూళ్లు తెరిచాక కరోనా కేసులు పెరిగాయని, విద్యార్థుల్లో ఎంతమందికి కరోనా సోకిందో, ఉపాధ్యాయుల్లో ఎంతమందికి సోకిందో.. బ్యానర్ ఐటమ్…

ఏపీలో పాఠశాలల పునఃప్రారంభంపై టీడీపీ అనుకూల మీడియా ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. స్కూళ్లు తెరిచాక కరోనా కేసులు పెరిగాయని, విద్యార్థుల్లో ఎంతమందికి కరోనా సోకిందో, ఉపాధ్యాయుల్లో ఎంతమందికి సోకిందో.. బ్యానర్ ఐటమ్ పెట్టి మరీ ఈనాడులో వార్తలొచ్చాయి. 

ఇక స్థానిక ఎన్నికలకు, స్కూళ్లకు లింకు పెడుతూ రకరకాల విన్యాసాలు చేశారు. స్కూళ్లు తెరిచారు కానీ, ఎన్నికలకు భయపడుతున్నారంటూ వైసీపీపై సెటైర్లు వేశారు. ఆ పేపర్ కటింగ్ లు పట్టుకుని, విద్యార్థుల భవితవ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది అంటూ టీడీపీ చేసిన తప్పుడు ప్రచారం అంతా ఇంతా కాదు.

కట్ చేస్తే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు, వారి చదువుల గురించి ఈనాడు ఎక్కడలేని సింపతీ చూపించింది. పిల్లలంతా స్కూళ్లకు వెళ్లకుండా ఇంట్లోనే కష్టపడుతున్నారని, స్కూళ్లు లేకపోవడం వల్ల పొలం పనులకు వెళ్తున్నారని వారి కష్టాలు ఇవీ అంటూ ఈనాడు ఓ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది.

ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా.. చాలా మంది ఇళ్లలో కనీసం టీవీలు లేవని, స్మార్ట్ ఫోన్లు అసలే లేవని.. ఒకరకంగా స్కూళ్లు తెరవడం మేలని మేల్కొలుపు కథనాన్ని వండి వార్చింది. ఎక్కువ కాలం బడులు మూసి ఉంచడం వల్ల చాలామంది పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, డ్రాపవుట్లు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయని ఈనాడు వార్త సారాంశం.

మరి అదే నోటితో.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో కూడా ఓసారి వివరించొచ్చు కదా. తెలంగాణ పిల్లల చదువులపై అంత సింపతీ ఉన్న ఈనాడుకి, ఏపీలో బడికి పోతున్న పిల్లలు కనిపించలేదా? వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం, ప్రతిరోజూ స్కూళ్లలో తీసుకుంటున్న జాగ్రత్తలు కనిపించలేదా? ఏపీలో లాగా రోజు మార్చి రోజు స్కూళ్లను తెరిస్తే బాగుంటుందని, ఈ విషయంలో పక్క రాష్ట్రం ఆదర్శంగా ఉందని చెప్పడానికి ఈనాడుకి నోరు రాలేదు.

ఇప్పటికీ ఏపీలో చదువుల గురించి చెప్పాలంటే ప్రభుత్వం తెలివి తక్కువ నిర్ణయం తీసుకుందని, తొందరపడి స్కూళ్లు తెరిచారనే వార్తలు ఈనాడులో వస్తాయి. అదే సమయంలో తెలంగాణలో మాత్రం స్కూళ్లు తెరవకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న కష్టాలు ఈనాడులో కనిపిస్తాయి.

రాజకీయాలు, నాయకుల్లో తేడాలు చూపిస్తారు సరే, కనీసం పిల్లల చదువుల విషయంలో కూడా పారదర్శకంగా వార్తలు ఇవ్వలేని దుస్థితికి ఈనాడు చేరుకుందంటే.. అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. సమస్య ఎక్కడైనా ఒకటే. మరి దాన్ని ఇలా రెండు నాల్కల ధోరణితో చూడటం ఎంతవరకు సమంజసం. 

రాజ్యాంగం విఫలం అయిందనడం ధర్మమేనా?