చంద్రబాబు ఎలాగూ జనంలోకి రావడానికి భయపడుతున్నారు. చినబాబు అడ్రస్ కూడా బైటకు రాకుండా ఎక్కడో పునరావాసం గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీపై పట్టు పెంచుకోడానికి కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. అయితే ఆ ప్రయత్నాలను మొదలులోనే అపర చాణక్యుడు చంద్రబాబు తుంచేశారని కూడా ప్రచారం జరుగుతోంది.
నంద్యాలలో మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఐ, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం మరింత సంచలనం అయింది.
వారి బెయిల్ వ్యవహారం కూడా ఇరు పార్టీల మధ్య విమర్శలకు దారి తీసిందంటే.. నంద్యాల కేసుపై రెండు పార్టీల నేతలు ఎంత ఫోకస్ పెట్టారో అర్థమవుతుంది. అయితే నంద్యాలకు జిల్లా స్థాయి నాయకులు మినహా.. టీడీపీ నుంచి పెద్ద తలకాయలు ఎవరూ వెళ్లలేదు.
చంద్రబాబు ఎలాగూ హైదరాబాద్ టు అమరావతి మాత్రమే అంటున్నారు. ఆమధ్య వరద బాధితుల కోసం బైటకొచ్చిన లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు అచ్చెన్నాయుడు.
చంద్రబాబుకి తెలియకుండానే నంద్యాల పర్యటన ఫిక్స్ చేసుకునేందుకు స్థానిక నాయకులకు ఫోన్ చేశారట. అయితే ఆ విషయం కాస్తా చంద్రబాబుకి చేరడంతో.. ఆయన వెంటనే అచ్చెన్నకు బ్రేక్ వేశారని తెలుస్తోంది.
నంద్యాలతో పాటు, నెల్లూరు జిల్లాలో కూడా ఓ మైనార్టీ కుటుంబాన్ని వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారంటూ వార్తలొచ్చాయి. కనీసం నెల్లూరైనా వెళ్లాలనేది అచ్చెన్న ప్లాన్. దీన్ని కూడా బాబే అడ్డుకున్నారట.
నేరుగా వెళ్లడం కంటే ఫోన్లో పరామర్శిస్తే చాలని సెలవిచ్చారట. దీంతో.. కేవలం ఫోన్ టాక్ కే పరిమితమైన అచ్చెన్న.. తన చేతులు కట్టేస్తున్నారని సన్నిహితుల దగ్గర వాపోయారట.
టీడీపీ ఏపీ పగ్గాలు చేపట్టగానే అచ్చెన్నాయుడిలో దూకుడు బైటపడింది. సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా.. గంటల వ్యవధిలోనే అచ్చెన్న రియాక్ట్ అయ్యేవారు. పార్టీ అధినేత కంటే ముందే వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో ఉంచుతున్నారు.
ఈ వ్యవహారాలు కూడా తగ్గించుకోవాలని చంద్రబాబు ఆయనకి సూచించారట. అంతే కాదు, ఇకపై పార్టీ కార్యాలయం సూచించిన తర్వాతే రియాక్ట్ కావాలని, ఎలా స్పందించాలో కూడా అక్కడి నుంచే సూచనలు వస్తాయని కూడా చెప్పేశారట.
మొత్తమ్మీద అధ్యక్షుడి హోదాలో పార్టీలో పట్టు పెంచుకోవాలని చూస్తున్న అచ్చెన్నాయుడికి నెల రోజుల్లోపే చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు. అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తూ ఆయన పదవి డమ్మీ అనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు.