బిగ్ బాస్ కార్యక్రమం అంటే.. అత్యంత వెగటు పూర్వకం అనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. తెలుగులో నానాటికీ తీసికట్టుగా తయారైంది. కొన్ని మీడియా సంస్థలు బిగ్ బాస్ నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఆ ప్రోగ్రామ్ అప్ డేట్ ను ఎప్పటికిప్పుడు ఇస్తూ.. దాన్ని లైవ్ లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాయి.
అక్కడ చెప్పుకునేంత సీన్ ఏమీ లేకపోయినా.. ఏదో జరిగినట్టుగా, ఏదో జరిగిపోతున్నట్టుగా కలరింగ్ ఇవ్వడానికి ఆ మీడియా సంస్థలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు!
తెలుగు బిగ్ బాస్ ఒక థర్డ్ గ్రేడ్ ప్రోగ్రామ్ సగటు ప్రేక్షకుడి దృష్టిలో. తమిళ బిగ్ బాస్ లోతెంతో తెలియదు కానీ, ఆ కార్యక్రమంలో కమల్ హాసన్ మాత్రం బాగానే రాణిస్తున్నారు. తమిళంలో మొదటి నుంచి బిగ్ బాస్ కు కమల్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
కొత్తదనానికి ఎప్పుడూ ప్రాధాన్యతను ఇచ్చే కమల్ ఈ కార్యక్రమం బాధ్యత తీసుకున్నాడు. అక్కడ కూడా కంటెస్టెంట్ల స్థాయి చాలా చిన్నదిగా మారిపోతూ ఉంది. మరీ అనామకులను తెచ్చి ఆడిస్తున్నారు. కానీ హోస్టు మాత్రం తన సత్తా చూపుతున్నారు.
ఈ క్రమంలో కమల్ బిగ్ బాస్ హౌస్ మేట్లతో చాట్ లో భాగంగా చెప్పిన శ్రీశ్రీ కవిత వైరల్ గా మారింది. మహాకవి రాసిన మహాప్రస్థానంలో భాగమైన 'పతితురాల భ్రష్టులారా..' కవితను వినిపించాడు కమల్. అందుకు సంబంధించిన చిన్న వీడియో వైరల్ గా మారింది.
తమిళంలో భారతియర్ వలే తెలుగులో మహాకవి శ్రీశ్రీ అని కమల్ పోలిక పెట్టారు. ఆయన రాసిన మహాప్రస్థానాన్ని కీర్తిస్తూ కమల్ ఒక కవిత అలవోకగా చెప్పారు. తెలుగును సుందర తెలుంగు అని భారతియర్ కీర్తించిన వైనాన్ని కూడా కమల్ ఆ సందర్భంగా ప్రస్తావించారు.
కమల్ నటించిన పలు సినిమాల్లో శ్రీశ్రీ ప్రస్తావన ఉంటుంది. ఆకలిరాజ్యం తమిళ వెర్షన్ లో సుబ్రమణ్య భారతి కవితలను వల్లెవేస్తూ ఉంటాడు హీరో. అదే సినిమా తెలుగు వెర్షన్లో మహాకవి శ్రీశ్రీ కవితలను సందర్భానుసారం ఉపయోగించారు.
అలాగే మహానది సినిమా డబ్బింగ్ వెర్షన్లో శ్రీశ్రీ కవితలు వినిపిస్తాయి. ఇంద్రుడు చంద్రుడులో క్లైమాక్స్ లో శ్రీశ్రీ కవితలు చెబుతాడు కమల్. అయితే ప్రజలను అసలు సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి నేతలు చేసే అసందర్భ ప్రసంగాల్లో వాటిని వాడారు.
ఇవన్నీ దశాబ్దాల కిందటి సినిమాలు. అయినా కమల్ పై శ్రీశ్రీ ప్రభావం ఉన్నట్టుంది. ఎక్కడో బిగ్ బాస్ షో హోస్టుగా కమల్ కు శ్రీశ్రీ గుర్తొచ్చాడంటే.. అది ఆయన కవితల గొప్పదనం, కమల్ పై వాటి ప్రభావానికి నిదర్శనం.