ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'అమ్మ ఒడి' పథకాన్ని నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బి గుడెనఫ్ ప్రశంసించారు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి, మనిషి మట్టిలో కలిసిపోయేంత వరకూ మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలనే తత్వాన్ని పాటించాలనే గుడెనఫ్ మానవాళి ప్రగతికి తనవంతు కృషి చేశారు. ప్రస్తుతం మన వాడే స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు తదితరాల్లో వాడే లిథియమ్ ఇయాన్ బ్యాటరీల్లో క్యాథోడ్ ను ఆవిష్కరించింది ఈ మేధావే. 98 యేళ్ల ఈ వరల్డ్ క్లాస్ ఇన్వెంటర్ దృష్టికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'అమ్మ ఒడి' పథకాన్ని తీసుకెళ్లింది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగం.
భారత్ వంటి దేశంలో పిల్లలను చదువుకు పంపించే తల్లికి ఆర్థిక స్వావలంభన కలిగించే పథకాన్ని ఈ నోబెల్ గ్రహీత ప్రశంసించారు. నేర్చుకోవడం మనిషి విధి అనే ఈ నోబెల్ గ్రహీతకు ఇండియాలో పరిస్థితులు ఏమీ తెలియనివి కావు. మన దగ్గర నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా ఎంతో మంది పిల్లలకు ఆర్థిక శక్తి లేక మంచి చదువులు చదివే అవకాశం లేకుండా పోతోంది. ఇదే ఇండియాకు పెద్ద శాపం కూడా. ఇలాంటి నేపథ్యంలో అమ్మ ఒడి వంటి పథకం ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికీ పిల్లలను బాల కార్మికులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను చదువుకు పంపించే తల్లికి ఆర్థిక సాయం చేస్తూ ఉంది. ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లులకు అది ఫీజులకు, ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపించే వాళ్లకు పోషణకు పని కొచ్చే స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని ఒక నోబెల్ గ్రహీత కూడా ప్రశంసించారు. ఒక వీడియో మెసేజ్ ను కూడా విడుదల చేశారు.