ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్యను 25కు పెంచుతామని ఇది వరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి మూడు పట్టణాలను జిల్లాలుగా ఏర్పరుస్తున్నట్టుగా సమాచారం. దశల వారీగా మిగతా జిల్లాలను చేస్తారని, ప్రస్తుతానికి మూడు జిల్లాల ఏర్పాటుకు మాత్రం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉంది.
అదే మెడికల్ కాలేజీల ఏర్పాటు. అరకు, మచిలీపట్నం, గురజాల.. ఈ మూడు చోట్లా కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఇప్పుడు జిల్లాలుగా కూడా చేయడం ద్వారా భారత వైద్యమండలి (ఎంసీఐ) నుంచి కొంత రాయితీ పొందే అవకాశం ఉంది. సాధారణంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే ఐదారు వందల కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. కొన్ని చోట్ల మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎంసీఐ అరవై శాతం వరకూ రాయితీ ఇస్తుంది. ఆ ఖర్చును ఆ సంస్థ భరిస్తుంది.
కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఇంత వరకూ మెడికల్ కాలేజీ లేని జిల్లాలో కొత్తగా కాలేజీ పెట్టాలి. అలాగే ఆ ప్రాంతంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం వంటి షరతులు కూడా ఉన్నాయి. గురజాల, మచిలీపట్నం, అరకులను ఇప్పుడు వేర్వేరు జిల్లాలుగా చేయడం ద్వారా అక్కడ నెలకొల్పే మెడికల్ కాలేజీలకు ఎంసీఐ రాయితీలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అరకు వంటి గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడం ఆహ్వానించదగిన అంశం. ఉత్తరాంధ్రకు మేలు చేసే అంశం.