వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక డిఫరెంట్ ఎత్తుగడతో రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్ల మీద ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో జగన్ వైఖరి నచ్చని కారణంగా.. పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరేసిన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన నలుగురిని పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
వీరు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీలో చేరి, తమ తమ నియోజకవర్గాల నుంచి టీడీపీ టిక్కెట్ పై పోటీచేసే అవకాశం ఉంది. అయితే వీరిలో ఒక సస్పెండెడ్ ఎమ్మెల్యే మీద, ఆయన కన్నకూతురినే వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపడానికి వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతానికి వైసీపీ నుంచి సస్పెండ్ అయి ఉన్నారు. సస్పెండైన తర్వాత.. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు.. దమ్ముంటే వచ్చి తనను అడ్డుకోవాలంటూ.. ఆయన స్వయంగా వెళ్లి ఉదయగిరి బస్సుస్టాండులో కుర్చీ వేసి కూర్చుని హల్చల్ చేశారు. ఆయన నేరుగా జగన్ కే సవాళ్లు విసురుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు పరిస్థితులను గమనిస్తే.. రాబోయే ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద వైఎస్సార్ కాంగ్రెస్ ఆయన కన్న కూతురినే పోటీకి నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిద్వారా.. మేకపాటి కుటుంబ ఓటు బ్యాంకు కూడా లాస్ కాకుండా.. ఆయనకు గుణపాఠం చెప్పడం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
చంద్రశేఖరరెడ్డి సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన తమ్ముడు చేసిన ద్రోహాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన క్రాస్ ఓటింగ్ తనకు బాధ కలిగించిందన్నారు. రాజమోహన్ రెడ్డి చెబుతున్న వివరాలను బట్టి.. చంద్రశేఖర రెడ్డి పార్టీకి ద్రోహం చేస్తున్న సంగతి పార్టీ వారికి ముందే తెలుసు. తాను తమ్ముడిని వారించేందుకు ప్రయత్నించానని కూడా మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఉదయగిరినుంచి ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తామని ఆయన అంటున్నారు.
అయితే అదే సమయంలో.. చంద్రశేఖర రెడ్డి కూతురు రచనారెడ్డిని నిలబెడితే బాగుంటుందని రాజమోహన రెడ్డి ఓ సలహా కూడా ఇచ్చారు. చంద్రశేఖర రెడ్డి చుట్టూ రెండో పెళ్లి వివాదం ఒకటి తీవ్రంగా ఉంది. ఆ రెండోభార్యను ఉద్దేశించి.. రాజమోహన రెడ్డి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక దుష్ట శక్తి తన తమ్ముడి జీవితంలోకి ప్రవేశించాక, తాను మాట్లాడడమే మానేసినట్టు ఆయన చెప్పారు.
చూడబోతే.. రాజమోహన రెడ్డి చొరవతో.. ఉదయగిరి నియోజకవర్గం అనేది మేకపాటి కుటుంబం చేయిదాటి పోకుండా ఉండేందుకు, చంద్రశేఖర రెడ్డి కూతురు రచనారెడ్డిని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే.. ఉదయగిరి బరి తండ్రీ కూతుళ్ల సవాల్ కు వేదిక అవుతుంది.