నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ లెఫ్టినెంట్ అనుకోవాలి. పవన్ కళ్యాణ్ తరువాత ఆ పార్టీకి అన్నీ ఆయనే. అలాంటి వ్యక్తి గత దాదాపు ఏడెనిమిది నెలల కాలంగా సైలంట్ గా వున్నారు.
ప్రస్తుతం ఆయన నిరాశలో వున్నారని రాజకీయ వర్గాల బోగట్టా. విషయం ఏమిటంటే, వైకాపా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చేయాలని డిసైడ్ అయిపోయారు.
సినిమాలు వదిలేసాను జనం కోసం, వేలకోట్ల ఆదాయం వదిలేసాను ప్రజల కోసం అని చెప్పిన కబుర్లు అన్నీ కన్వీనియెంట్ గా మరిచిపోయి, మొహానికి మళ్లీ మేకప్ వేసుకోవాలని డిసైడ్ అయిపోయారు.
అప్పట్లోనే ఈ నిర్ణయం నచ్చక జనసేన నుంచి తప్పుకోవాలని నాదెండ్ల మనోహర్ అనుకుంటున్నారని వార్తలు వినిపించాయి. అయితే అవేవీ పక్కా కాలేదు కానీ మనోహర్ మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కాస్త పక్కకు జరిగినట్లే కనిపించింది.
కరోనా నేపథ్యంలో ఇది మరింత పెరిగింది. ప్రస్తుతం జనసేన వ్యవహారాల్లో నాదెండ్ల మనోహర్ పేరు ఎక్కడా వినిపించడం లేదు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కూడా చాలా మంది ఆంధ్ర రాజకీయ నాయకుల మాదిరిగా ఎక్కువగా హైదరాబాద్ లోనే గడుపుతున్నారని బోగట్టా.
నిత్యం హ్యాపీగా మార్నింగ్ వాక్ కు వెళ్తూ, అనేక మంది ఆంధ్ర జనాలతో మాటా మంతీ కలుపుతూ గడిపేస్తున్నారట. అయితే ఇలా మాట్లాడుతున్నపుడే పవన్ కళ్యాణ్ వైఖరి మీద, జనసేన భవిష్యత్ మీద నాదెండ్ల నిరాశపూరిత వైఖరి బయటపడుతోందని బోగట్టా.
కీలకమైన సమయంలో పవన్ ఇలా రాజకీయాల నుంచి దూరం జరిగి, సినిమాలు చేసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని నాదెండ్ల మనోహర్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయాలు, పరిస్థితులు, పవన్ వైఖరి ఇవన్నీ కలిసి నాదెండ్ల మనోహర్ ను నిరాశలో ముంచేసినట్ల కనిపిస్తోంది.