నాయకత్వం లేని పోరాటం చేస్తున్న టీడీపీ క్యాడర్

ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటించి టీడీపీ మేనేజ్ చేస్తోంది. సహజంగా ప్రతి పార్టీ చేసే పనే అది. అయితే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు సైతం గోడ దూకేస్తుండే సరికి.. ఇక…

ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటించి టీడీపీ మేనేజ్ చేస్తోంది. సహజంగా ప్రతి పార్టీ చేసే పనే అది. అయితే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు సైతం గోడ దూకేస్తుండే సరికి.. ఇక ఇన్ చార్జిల సంగతి మరింత దారుణంగా మారింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ కార్యకర్తలు నాయకుడు లేకుండానే పోరాటం చేస్తున్నారు. 

2019 ఎన్నికల్లో అక్కడ వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన కరణం బలరాం.. ఇద్దరూ ఇప్పుడు అధికార పార్టీ వైపే ఉన్నారు. అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయనుకున్నా కూడా అక్కడ వైసీపీకి బలం బాగా పెరిగింది. దాదాపుగా రెట్టింపైంది. ఇక టీడీపీ పరిస్థితి చూస్తే రోజు రోజుకీ దిగజారిపోతోంది.

వాస్తవానికి చీరాలలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. చేనేత సామాజిక వర్గానికి చెందినవారు, ఇతర బీసీ కులాల ప్రజలు, ఎస్సీలు.. గతంలో టీడీపీవైపే ఉన్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల కరణం బలరాం వైసీపీ వైపు వెళ్లిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ చార్జిగా యడం బాలాజీని నియమించారు. అయితే ఇన్ చార్జిగా ఒకటి రెండు కార్యక్రమాలకు హాజరైన ఆయన, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం చీరాలలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించాలంటే కార్యకర్తలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. నాయకుడు లేకపోయినా ఒంటరి పోరాటం చేస్తున్నారు.

దిక్కెవరు..?

టీడీపీ ఇన్ చార్జి యడం బాలాజీ, ప్రస్తుతం వైసీపీ నాయకులకు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించాలనుకుంటున్నారు. ఒంగోలు పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి ఆ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అయితే ఎవరిని ఇన్ చార్జిని చేసినా వైసీపీ తమవైపు లాగేసుకుంటుందేమోననేది టీడీపీ భయం. అందుకే ఆ విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. పోనీ మరో వ్యక్తికి బాధ్యత అప్పగిద్దామంటే, చేనేత సామాజిక వర్గం దూరమౌతుందని భయం.

టీడీపీ అధినాయకత్వం భయాలతో ఇప్పుడు చీరాలలో నాయకుడు లేకుండా ఒంటరిగా మిగిలింది టీడీపీ. కేడర్ మొత్తం చెల్లాచెదరయ్యేందుకు సిద్దంగా ఉంది. ఒక్క చీరాలలోనే కాదు, దాదాపు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.