పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు పోలింగ్ సెంటర్లకు వచ్చి ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం పోస్టింగ్ లు బాగా పెడుతుంటారు. మిగతా పార్టీలకు, నాయకులకు కూడా ఇలాంటి అభిమానులే ఉంటారు. కానీ ఇక్కడ జనసైనికులది విపరీత పోకడ. తమ నాయకుడ్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే విరుచుకుపడిపోతుంటారు. కనీసం వారిని అదుపులో పెట్టాలని, ఆవేశాన్ని అదుపు చేసి, దాన్ని ఓట్ల రూపంలో మలచుకోవాలనే ఆలోచన జనసేనానికే లేదు.
సోషల్ మీడియాలో మితిమీరి ప్రవర్తించడం జనసేన కార్యకర్తలకు కొత్త కాదు. గతంలో ఎన్నో సందర్భాలున్నాయి, వారిని అలా ప్రోత్సహించిందే కీలక నేతలు. తీరా అంతా జరిగిపోయాక మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకోవడం కూడా వారికి అలవాటే. తాజాగా కన్నాభాయ్ అనే సోషల్ మీడియా అకౌంట్ తో ఓ వ్యక్తి ఏకంగా సీఎం జగన్ ను మానవ బాంబుగా మారి హత్య చేస్తానంటూ ఉగ్రవాద ప్రకటన చేశాడు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజమండ్రికి చెందిన రాజపాలెం ఫణి ఈ పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ప్రకటనలు వరుసగా చేశాడు ఫణి. ఆ తర్వాత కొన్నింటిని డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయినప్పటికీ పోలీసులు వదల్లేదు. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో కన్నాభాయ్ అలియాస్ ఫణిని అరెస్ట్ చేశారు. ఇతడు జనసేన మద్దతుదారి అని ప్రకటించారు.
ఓవైపు ఇంత జరుగుతుంటే, జనసేన ఎప్పట్లానే మరోసారి రొటీన్ స్టేట్ మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇలా స్టేట్ మెంట్స్ ఇవ్వడం, తర్వాత తమ కార్యకర్తల్ని విడిపించుకోవడం జనసేనకు అలవాటుగా మారిపోయింది.
మైక్ దొరికితే సుద్దులు చెప్పే పవన్ కల్యాణ్.. ఈ విషయంలో మాత్రం తన అభిమానులు అలియాస్ కార్యకర్తల్ని మాత్రం కంట్రోల్ చేయరు. అయినా రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారనే సామెత ఉండనే ఉంది. ముందు పవన్ సంయమనంగా ఉండడం, మాటలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటే.. ఆటోమేటిగ్గా క్యాడర్ మొత్తం దారిలోకి వస్తుంది. నాయకుడే తిన్నగా లేనప్పుడు, ఉగ్రకార్యకర్తల్ని అని ఏంలాభం?
అయితే ఇలా జనసైనికులం, పవన్ భక్తులం అంటూ ఉగ్ర ప్రకటనలు చేసే వాళ్లంతా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అధినేతకు, ఇతర నేతలకు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. కార్తకర్తలే విపరీత ధోరణిలో ప్రవర్తిస్తూ తమ భవిష్యత్ ని తామే చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. సో.. జనసైనికులూ బీ కేర్ ఫుల్.. ఎవరి మెప్పు కోసమో మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు.