ఆంధ్ర ఉద్యోగుల వేతన సవరణ ఎందుకు ఇంత గందరగోళంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? పీఆర్సీ ఒప్పందం ఓకె అయిన తరువాత ఎందుకు వ్యవహారం బెడిసికొట్టింది? సాధారణంగా వేతన సవరణ ఎలా జరుగుతుంది? చూద్దాం.
పే రివిజన్ కమిషన్ ను వేసాక, ఆ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు కొంత తాత్కాలిక భృతి (ఇంటీరియమ్ రిలీఫ్) ను సిఫార్స్ చేస్తుంది. దానిని ప్రభుత్వం ఆమోదిస్తుంది. వన్స్ నివేదిక వచ్చిన తరువాత కొత్త స్కేల్స్ ఫిక్స్ చేస్తారు. పాత స్కేల్ కేటగిరీ ప్రకారం కొత్త స్కేల్ వుంటుంది.
పాత స్కేల్ లోని బేసిక్, డిఎ కలిపి కొత్త స్కేల్ ఫిక్స్ చేస్తారు. దానికి రెగ్యులర్ అలవెన్స్ లు అన్నీ మామూలే. కొత్త స్కేల్ ఫిక్స్ అయ్యాక బేసిక్ పెద్దగా వుంటుంది. డిఎ స్టార్టింగ్ లో వుంటుంది. ఇప్పటికే 17శాతం ఇంటీరియమ్ ఇచ్చాక, అంతకు మించి కొత్త పే స్కేలు ఫిక్స్ చేసాక ఎందుకు ఉద్యోగుల్లో అలజడి రేగుతోంది అన్నది ప్రశ్న.
జీతాలు తగ్గవు అని వీళ్లు..తగ్గుతాయని వాళ్లు ఎవరికి వారు అనడమే కానీ, కలిసి కూర్చుని డిస్కస్ చేస్తే తెగిపోయే సమస్య గా ఎందుకు చూడడం లేదు? ఇంటీరియమ్ రిలీఫ్ కన్నా పే ఫిక్సేషన్ పర్సంటేజ్ ఎక్కువ వున్నపుడు జీతాలు ఎందుకు తగ్గుతాయి?
అంటే అలవెన్స్ ల్లో కోత పెడుతున్నారా? హెచ్ఆర్ఎ విషయంలో కేంద్రం విధానాలను అనుసరిస్తున్నామని రాష్ట్రం చెబుతోంది. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకీ కొత్త పద్దతి. కేవలం అది ఒక్కటే సమస్య అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టు సడలిస్తే సరిపోతుంది.
అదే విధంగా పే రివిజన్ జరిగినపుడల్లా కొన్ని కొన్ని లూప్ హోల్స్ అమలు చేసే టైమ్ లో బయటపడడం అన్నది కామన్. వాటిని ఉత్తరోత్తరా సవరించడం కూడా అంతే కామన్. ఇక్కడ సమస్య చిన్నది, గొడవ పెద్దదిగా కనిపిస్తోంది. రెండు వైపులా పంతాలకు పోవడం ఒకటి, వైకాపాను సందు దొరికితే చాలు అప్రతిష్ట పాలు చేయాలనే 'సామాజిక' మీడియా వ్యవహారం ఒకటి కలిసి మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది.
మంత్రి వర్గ కమిటీ ని ఎలాగూ నియమించారు కనుక, ఉద్యోగుల అపోహలు తొలగించడం, అదే సమయంలో నిజంగానే జీతాలు తగ్గుతుంటే, దాన్ని మార్చడం ప్రభుత్వ తక్షణ అవసరం. ఈ విషయంలో పట్టింపులకు పోవడం ఇరు పక్షాలకు మంచిది కాదు.
ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ నష్టం జరగకూడదు. ఉద్యోగులకు ప్రజల నుంచి వ్యతిరేకత మరింత పెరగకూడడదు. ఈ రెండూ గమనించాలి. ఏటా వేల కోట్లు టీచర్ల జీతాల మీద ఖర్చు అవుతోంది. అయినా ప్రయివేటు విద్య ఎందుకు విలసిల్లుతోంది. ఏటా వేల కోట్లు వైద్య విభాగ జీతాల కోసం ఖర్చవుతోంది. అయినా జనాలు ఎందుకు ప్రయివేటు బాట పడుతున్నారు.
ఇప్పటికే బడ్జెట్ లో నాన్ ప్రొడెక్టివిటీ ఎక్స్ పెండించర్ లేదా నిర్వహణ ఖర్చు 90 శాతానికి చేరిపోతోంది. ఎప్పటికయినా ఈ బుడగ పేలకతప్పదు. మొదటికే మోసం తెచ్చుకునే విధంగా కాకుండా విజ్ఞతతో వ్యవహరించడం ఉద్యోగులకు అత్యవసరం. అదే సమయంలో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వుండడం ప్రభుత్వానికీ అవసరమే.