దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందడంతో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మరో మూడు నాలుగు నెలల్లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు.
తెలంగాణలో కేసీఆర్‌నే ఓడించామని , ఇక ఆంధ్రాలో జగన్ ఎంత? అని స్వయంగా దుబ్బాక విజేత రఘునందన్‌రావు అనడం వైరల్ అవుతోంది. గెలుపు ఆ మాత్రం విశ్వాన్ని కలిగించడంలో ఆశ్చర్యం లేదు. అయితే దుబ్బాకకు, తిరుపతికి మధ్య ఎంత దూరం ఉందో… తిరుపతిలో బీజేపీ విజయానికి కూడా అంతే దూరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో మిత్రపక్షమైన జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే తమ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? అని మొట్ట మొదట ఆ పార్టీ వేసుకోవాల్సిన ప్రశ్న.
టీడీపీ, వైసీపీలు తమ ప్రధాన ప్రత్యర్థులని బీజేపీ ప్రకటిస్తే …. అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో తమకంటే ఏ పార్టీ ఎక్కువ ఓట్లు సంపాదించిందో, దాన్నే ప్రత్యర్థిగా ఏ పార్టీ అయినా భావిస్తుంది.
ఈ సూత్రమే రాజకీయాల్లో ఎక్కడైనా వర్తిస్తుంది. అది దుబ్బాకైనా, తిరుపతైనా. కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రానా భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకంగా రూల్స్ ఉండవు. ఈ విషయాన్ని ఆ పార్టీ ముందుగా గ్రహించాల్సి ఉంది.
తిరుపతి ఉప ఎన్నికపై ప్రధానంగా బీజేపీ సమరోత్సాహంతో ముందుకెళుతోంది. ఇప్పటికే తిరుపతిలో ఒక దఫా సమావేశాన్ని కూడా ఆ పార్టీ నిర్వహించింది. అందువల్ల తిరుపతి ఓటర్ నాడి గురించి చర్చించుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. వీటన్నింటిలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన తిరుపతి విద్యావంతులు, మేధావులకు నెలవు. ఇది రాజకీయ చైతన్యానికి ప్రతీకైన పార్లమెంట్ స్థానం.
ఈ పార్లమెంట్ పరిధిలో నోటాకు మూడో స్థానం దక్కుతుండడాన్ని ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. మన దేశ ఎన్నికల ప్రక్రియలో నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) అనేది 2013లో అమల్లోకి వచ్చింది.
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తమకు నచ్చిన వాళ్లెవరూ లేకపోతే , ప్రత్యామ్నాయంగా తమ అభిప్రాయాన్ని ప్రకటించేందుకు ఈ ఆప్షన్‌ను ఎన్నికల సంఘం ఓటర్లకు ఓ అవకాశంగా ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానంలో నోటాకు వచ్చిన ఓట్ల గురించి తెలుసుకుందాం.
2014లో తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వరప్రసాద్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ బరిలో నిలిచి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక మూడో స్థానం నోటా దక్కించుకోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో నోటాకు 35,420 ఓట్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు మూడు శాతం ఓట్లను నోటా తన ఖాతాలో వేసుకుందన్న మాట.
అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు గెలుపొందారు. ఇటీవల అనారోగ్యంతో ఈయన మృతి చెందడం వల్లే ఉప ఎన్నికకు దారి తీసింది. కాగా ఈ ఎన్నికలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన వేర్వురుగా నిలిచాయి.
జనసేనతో పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు పోటీ చేశారు. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నిలిచారు. నోటాకు 25,781 ఓట్లు లభించాయి. ఈ ఓట్లతో నోటా మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఇక ప్రస్తుతం కలిసి పోటీ చేయాలనుకుంటున్న జనసేన మిత్రపక్షమైన బీఎస్పీ అభ్యర్థికి 20,971, అలాగే బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు 16,125 ఓట్లు దక్కాయి. దేశమంతా మోడీ గాలి వీచినా తిరుపతిలో మాత్రం బీజేపీపై ఆ ప్రభావం ఏ మాత్రం చూపకపోవడం గమనార్హం.
తిరుపతిలో బీజేపీ బలం ఎంతో తిరుపతి విమానాశ్రయంలో చూడొచ్చనే అభిప్రాయం ఉంది. తిరుమల దర్శనానికి వచ్చే బీజేపీ పాలిత రాష్ట్రాల వీవీఐపీల కోసం విమానాశ్రయంలో పడిగాపులు కాయడానికే తిరుపతి బీజేపీ నేతలకు సరిపోతోందని సొంత పార్టీ కార్యకర్తలే వ్యంగ్యంగా అంటుంటారు.
దుబ్బాకలో రఘునందన్‌రావుకు విజయం గాలివాటంగా దక్కింది కాదు. దాని వెనుక ఎంతో శ్రమ, త్యాగం ఉంది. తిరుపతి పార్లమెంట్ స్థానంలో ముందుగా తమకంటే ఎంతో ముందంజలో ఉన్న నోటాను బీజేపీ అధిగమించాల్సి వుంది.
టీడీపీతో పొత్తు ఉండడం వల్లే బీజేపీ గతంలో ఒకసారి గెలుపొందింది. మరోసారి గట్టి పోటీ ఇచ్చింది. అంతే తప్ప తిరుపతిలో బీజేపీ స్వయం ప్రకాశితం కాదు. దానికి టీడీపీ తోడైతేనే ఉనికి.
సున్నాకు ఎడమ వైపు ఏదో ఒక అంకె చేరితేనే ….జీరోకు విలువ. ఇదే సూత్రం బీజేపీకి కూడా వర్తిస్తుంది. అందువల్ల బీజేపీ తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో తెలుసుకుని సవాళ్లు విసిరితే మంచిది.