పున‌ర్విభ‌జ‌న‌, మ‌హిళా కోటా.. ఇప్పుడే కాదు కానీ!

ఎట్ట‌కేల‌కూ మ‌హిళా బిల్లుకు మోక్షం క‌లుగుతోంది! ద‌శాబ్దాలు వార్త‌ల్లో, చ‌ర్చ‌లో ఉన్న‌.. మ‌హిళా బిల్లును గ‌తంలో యూపీఏ ప్ర‌భుత్వం కూడా ప‌లు సార్లు తెర‌పైకి తీసుకొచ్చింది. అయితే దాని ఆమోదం కుద‌ర్లేదు. ఇప్పుడు మోడీ…

ఎట్ట‌కేల‌కూ మ‌హిళా బిల్లుకు మోక్షం క‌లుగుతోంది! ద‌శాబ్దాలు వార్త‌ల్లో, చ‌ర్చ‌లో ఉన్న‌.. మ‌హిళా బిల్లును గ‌తంలో యూపీఏ ప్ర‌భుత్వం కూడా ప‌లు సార్లు తెర‌పైకి తీసుకొచ్చింది. అయితే దాని ఆమోదం కుద‌ర్లేదు. ఇప్పుడు మోడీ స‌ర్కారు చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల చ‌ట్టాన్ని తెర‌పైకి తీసుకొచ్చి, ఆమోదింప‌జేస్తోంది. ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ లో మోడీ స‌ర్కారుకు ఉన్న బ‌లాన్ని బ‌ట్టి ఈ చ‌ట్టం పూర్తి స్థాయిలో ఆమోదం పొంద‌డం లాంఛ‌న‌మే!

అయితే ఈ చ‌ట్టం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వ‌ర్తించ‌దు. 2024 ఎన్నిక‌ల్లో మ‌హిళా కోటా కేవ‌లం పార్టీల నిర్ణ‌యాన్ని బ‌ట్టే జ‌రుగుతుంది. 2029 ఎన్నిక‌ల నాటికి మాత్రం మ‌హిళా బిల్లు అమ‌ల్లోకి రావొచ్చ‌ని కేంద్రం చెబుతోంది! అయితే క‌చ్చితంగా వ‌స్తుంద‌ని కాదు, వ‌చ్చే ఛాన్సులున్నాయి. ఆలోపు దేశంలో లోక్ స‌భ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న జ‌ర‌గ‌నుంది.  ఇటీవ‌లే పార్ల‌మెంట్ భవనంలో ఎంపీల సీట్ల‌ను సంఖ్య‌ను పెంచుకున్న ముచ్చ‌ట‌ను చూశాం. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం దేశంలో పెర‌గ‌బోయే ఎంపీల సంఖ్య‌కు త‌గ్గ‌ట్టుగా ఉంది.

అయితే జ‌నాభా ప‌రంగా లోక్ స‌భ సీట్ల సంఖ్య‌ను పెంచింతే దేశంలో క‌ల్లోలం రేగే అవ‌కాశాలూ ఉన్నాయి. ఇప్ప‌టికే కేవ‌లం ఉత్త‌రాది రాష్ట్రాల మ‌ద్ద‌తుతో కేంద్రంలో ఎవ‌రైనా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది. సౌత్ లో ఒక్క ఎంపీ సీటు లేక‌పోయినా ఫ‌ర్వాలేదు!

మ‌రి రేపు జ‌నాభా ప‌రంగా గ‌నుక లోక్ స‌భ సీట్ల సంఖ్య పెరిగితే.. అంతే సంగ‌తులు! లోక్ స‌భ నిండా.. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల ఎంపీలే ఉంటారు. నార్త్ బెల్ట్ లో ఎంపీల‌ను స్వీప్ చేసేస్తే చాలు.. ఎంచ‌క్కా కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేయ‌వ‌చ్చు!  జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం.. లోక్ స‌భ సీట్ల‌ను పెంచితే మాత్రం అంతే సంగ‌తులు.

జ‌నాభా నియంత్ర‌ణ పాటించిన పాపానికి ద‌క్షిణాది రాష్ట్రాలు రాజ‌కీయంగా త‌మ ప్రాధాన్య‌త‌ను కోల్పోయే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి ప‌న్నుల‌ను వ‌సూలు చేసుకోవ‌డం మిన‌హా కేంద్రం ఈ రాష్ట్రాల‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసినా ప‌ట్టించుకునే నాథుడు ఉండ‌డు!  మ‌రి నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న అనేది దేశ రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌బోయే అంశ‌మే!

ఇక మ‌హిళా బిల్లు అమ‌ల్లోకి వ‌చ్చినా.. పెద్ద మార్పేం ఉండ‌క‌పోవ‌చ్చు! ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న నేత‌ల భార్య‌లు, కూతుళ్లే వీళ్ల స్థానంలో పోటీ చేస్తారు! మ‌హిళ‌ల‌ను ముందు పెట్టి వీరు చ‌క్రం తిప్పుతారు. కీల‌క‌మైన నేత‌ల సీట్లు రిజ‌ర్వ్ అయినా వారు వేరే నియోజ‌క‌వ‌ర్గాల‌ను చూసుకోనూ గ‌ల‌రు! మ‌హిళా బిల్లు ద్వారా ప్ర‌స్తుత రాజ‌కీయ కుటుంబంలోని మ‌హిళా నేత‌లు బ‌య‌ట‌కు వ‌స్తారు త‌ప్ప‌! సాధార‌ణ మ‌హిళ‌ల‌కు ఏదో ఒరుగుతుంద‌నుకోవ‌డం భ్ర‌మ‌!