ఎమ్బీయస్‌: రైతుల వెతలకు కారణం..

అంతిమంగా బిల్లు పాస్‌ అవుతుందో లేదో తెలియదు కానీ రాజధాని మార్పు నిర్ణయం జరిగింది. అమరావతిలో అద్భుతనగరం వస్తుందని ఆశించి భూములు కొన్న రియల్‌ ఎస్టేటు వ్యాపారస్తులు, సామాన్యులు ఉసూరుమంటే అంటారు. హైదరాబాదులో ఎయిర్‌పోర్టు…

అంతిమంగా బిల్లు పాస్‌ అవుతుందో లేదో తెలియదు కానీ రాజధాని మార్పు నిర్ణయం జరిగింది. అమరావతిలో అద్భుతనగరం వస్తుందని ఆశించి భూములు కొన్న రియల్‌ ఎస్టేటు వ్యాపారస్తులు, సామాన్యులు ఉసూరుమంటే అంటారు. హైదరాబాదులో ఎయిర్‌పోర్టు ఫలానా చోట వస్తుందని, హార్డ్‌వేర్‌ పార్కు ఫలానాచోట అన్న వార్తలు విని, కొని, తర్వాత నెత్తి కొట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు, జూదం లాటి యీ వ్యాపారంలో అవి సహజమైనవే. కానీ రైతుల విషయంలోనే అందరూ ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గతప్రభుత్వం వారికి చాలా ఆశలు చూపించింది. కాకమ్మ కబుర్లు చెప్పింది. చివరకు చేతకాక బోర్లా పడింది. ఈ ప్రభుత్వం వచ్చి ఆ ఆశలను మొదలంటా తుంచేసింది. అయినా టిడిపి అనుయాయులు యింకా ఏదో వస్తుందంటూ వారిలో ఆశలు నింపుతున్నారు.

రాజధాని మార్పు ఖర్చు గురించి తాజాగా సుజనా చౌదరి జగన్‌కు రాసిన బహిరంగ లేఖలో రాజధాని మారిస్తే రైతులకు వచ్చే నష్టపరిహారం గురించి ప్రస్తావించారు. రాజధాని మార్చకూడదని వాదిస్తూ కట్టడానికి రూ.లక్ష కోట్లు అవుతుందని జగన్‌ చెప్పినమాట 'సత్యదూరం' అన్నారాయన. మరి నారాయణ అసెంబ్లీలో రూ. 1.09 కోట్లు అవుతుందన్నారే! అది దేనికి దూరం? కాదూకూడదని మారిస్తే ప్రభుత్వం రూ.1,89,117 కోట్లు నష్టపరిహారంగా యివ్వాల్సి వుంటుంది అని లెక్కకట్టి చెప్పారు. ఇది సంస్థలకు, కాంట్రాక్టర్లకు, వ్యక్తులకు కలిపి..అట! ఈ అంకె స్ప్లిట్‌ అప్‌ ఆయన లేఖలో యిచ్చారేమో తెలియదు కానీ అది పేపర్లలో రాలేదు. వ్యక్తులు అనగానే తామే అనుకుని రైతులు ఆ డబ్బు గురించి ఎదురు చూస్తారేమోనని నా భయం.

సుజనా చెప్పిన సంస్థలు అంటే ప్రభుత్వం నుంచి చౌకధరల్లో భూములు కేటాయింప చేసుకున్న సంస్థలా? నిన్న బుగ్గన అసెంబ్లీలో ప్రకటించారు – డిఫెన్సుతో సహా ప్రభుత్వ సంస్థలకు ఎకరాకు కోటి రూ.లు రేటుపై 60 ఏళ్ల లీజుకి, ఔట్‌రైట్‌ అమ్మకమైతే 4 కోట్లకు అమ్మారు. అదీ 1.4, 2.5, 3.2 ఎకరాలు అలా..! ప్రయివేటు యూనివర్శిటీలకైతే తలా 200 ఎకరాల లెవెల్లో ఎకరా 50 లక్షలకే ఔట్‌రౌట్‌ అమ్మకం! ప్రభుత్వ సంస్థలతో వ్యవహారం స్మూత్‌గానే ఉంటుంది. 'ప్రయివేటు సంస్థలకు రూ.50 లక్షలకు అమ్మారు, మాకు లీజు అంటున్నారు. భూములు వెనక్కి యిచ్చేస్తాం, డబ్బు వాపస్‌ యిచ్చేయండి' అనవచ్చు.

ఇక ప్రయివేటు సంస్థలు ఎనిమిదో వంతు రేటుకే భూములు తీసుకుని యిప్పుడు నష్టపరిహారం ఎలా అడగగలవు? అంతగా కావలిస్తే 'మేం ఆశించిన రీతిలో యీ ప్రాంతం డెవలప్‌ కావటం లేదు, అందువలన భూములు సరెండర్‌ చేసేస్తాం, మా డబ్బు మాకిచ్చేయండి' అనవచ్చు. మహరాజులాగ భూములిచ్చేసి, డబ్బు పట్టుకెళ్లండి అని ప్రభుత్వం చులాగ్గా అనేస్తుంది. వాళ్లతో రాసుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తే దానిలో నష్టపరిహారం విషయం ఉందో లేదో తెలుస్తుంది.

ఇక కాంట్రాక్టర్లు! చేసిన పనికి డబ్బులు రాక వాళ్లు అఘోరిస్తున్నారు. జగన్‌ వచ్చాక రూ. 42 వేల కోట్ల పనులు ఆపేశారని, సుజనా ఆరోపించారు. బాబు వేసిన ప్లాన్లకు అనుగుణంగా మీరు మాకు కాంట్రాక్టులు యివ్వటం లేదు అని కాంట్రాక్టర్లు నష్టపరిహారం అడుగుతారా? పనులే జరగనప్పుడు యిక బిల్లు చెల్లింపులు, నష్టపరిహారాల సమస్య ఎందుకు వస్తుంది? 25% వరకే పని పూర్తయినవి ఆపేశారు కాబట్టి వాళ్ల ఒప్పందాల్లో యీ క్లాజ్‌ ఏదైనా ఉంటే, అది వందల కోట్లలో ఉంటుంది తప్ప వేల, లక్షల కోట్లలో ఉంటుందనుకోవడానికి లేదు.

ఇక వ్యక్తుల గురించి – అంటే రైతుల గురించి అనే అనుకోవాలి. ఆ మాట అనడానికి సుజనా సిగ్గుపడడానికి కారణం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం కాపీలను ఆయన చదివారేమోనని నాకు అనుమానంగా ఉంది. (ఒప్పందాల గురించి తర్వాతి పేరాలలో) రియల్‌ ఎస్టేటు డీలర్ల గురించి సుజనా ప్రస్తావించి వుంటే – వాళ్లకు నష్టపరిహారం ఎలాగూ ఉండదు. గుఱ్ఱప్పందాలలో పందెం కాసినవాడు, నేను పందెం కాసిన గుఱ్ఱం సరిగ్గా పరిగెట్టలేదని పరిహారం అడగడు కదా!

ఇక రైతుల గురించి చెప్పాలంటే – వారి ఆందోళన సాగుతూనే ఉంది. తమాషా ఏమిటంటే బాబు హయాంలో భూములు సేకరించినప్పుడూ అక్కడ సెక్షన్‌ 144 పెట్టారు. కావాలంటే వెనక్కి యిచ్చేస్తామంటున్నపుడూ జగన్‌ హయాంలో సెక్షన్‌ 144 పెట్టారు. జగన్‌ వచ్చాక తన ప్రభుత్వం ఎదుర్కున్న అది పెద్ద సమస్య యిది. టిడిపి దీన్ని జీవన్మరణ సమస్యగా ఎంచుకుంది. ఇసుక సమస్య తీరిపోయిందేమో తెలియదు కానీ దాని గురించి మాట్లాడడం మానేశారు. నిజానికి అది రాష్ట్ర సమస్య.

ఇది కృష్ణా, గుంటూరు జిల్లాలకు, అందునా అక్కడ భూములు కొన్నవారికి, రైతులకు సంబంధించిన సమస్య. కానీ అది తప్ప వేరేదీ తోచటం లేదు టిడిపి వారికి. ఒకప్పటి టిడిపి భాగస్వామి, బిజెపి యిప్పుడు మళ్లీ టిడిపితో స్వరం కలుపుతోంది. 2019 మానిఫెస్టోలో బిజెపి ఏం చెప్పిందో జగన్‌ నిన్న అసెంబ్లీలో చూపించారు. రాయలసీమలో శాశ్వత హైకోర్టు పెడతామని, అమరావతిని బాబు రియల్‌ ఎస్టేటు వెంచర్‌గా మార్చేశారు కాబట్టి, రైతులు కోరితే వాళ్ల భూములు వెనక్కి యిచ్చేస్తామనీ బిజెపి వాగ్దానం చేసింది. జగన్‌ ఆ రెండూ అమలు చేస్తున్నాడు.

టిడిపి, బిజెపి ఎంత చేసినా వాళ్లు ఊహించనంత స్థాయిలో వ్యతిరేకత రావటం లేదని వారికి తోస్తోంది. అందుకే ఇంత ఘోరం జరుగుతూంటే తిరగబడరేం? మీకు చేవ చచ్చిందా? అని మీడియాలో ఓ వర్గం ప్రజానీకాన్ని అడుగుతూ వచ్చింది. ప్రజాచైతన్యం గురించి మేధావులు తెగ ఆరాటపడిపోతూ ఉంటారు కానీ, సాధారణ ప్రజలు ఓ పట్టాన స్పందించరు. ఎప్పుడో ఎన్నికల సమయంలో తమ అభిప్రాయం చెప్తారంతే. వాళ్లు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటే నాయకులు హెచ్చరికగా ఉంటారు.

ఈ విషయం టిడిపి నాయకులకు తెలియక కాదు. తాము అధికారంలో ఉన్నపుడు ఏ ప్రతిఘటనా ఉండకూడదని, తాము ప్రతిపక్షంలో ఉండగా తిరగబడాలని కోరుకుంటారు. నిన్న రాజధాని మార్పు గురించి అసెంబ్లీ సమావేశం జరుగుతూండగా బయటంతా బీభత్సంగా ఉంది. వైసిపి వాళ్లు సెక్షన్‌ 144 పెట్టి, రాత్రి 11 దాకా కూర్చుని ఒక్క రోజులో తీర్మానం చేసి అవతల పడేశారు. సెక్షన్‌ 144 పెట్టడం ఘోరం అని టిడిపి వాళ్లంటే మీ హయాంలో మచిలీపట్టణంలో, తూర్పుగోదావరి జిల్లాలో నెలల తరబడి ఆ సెక్షన్‌ అమలు చేశారని జగన్‌ గుర్తు చేశాడు. కొద్ది రోజులుగా టిడిపి చేస్తున్న హడావుడి చూసి, నిన్న ఎక్కడో అక్కడ పోలీసు కాల్పుల దాకా వ్యవహారం వెళుతుందనుకున్నాను. అంతదాకా పోలేదు, సంతోషం.

నిన్న బాబు జగన్‌కు 'చిన్నవాడివైనా చేతులెత్తి మొక్కుతున్నాను, రాజధాని మార్చకు, అన్నీ ఒకే చోట పెట్టు' అన్నారు. నిజానికి ఆయన మొక్కాల్సింది జగన్‌కు కాదు, చేతులు జోడించి క్షమాపణ చెప్పాల్సింది రైతులకు, తన కబుర్లు నమ్మి అధిక రేట్లకు భూములు కొని దగా పడినవారికి! రైతుల దగ్గర్నుంచి 34 వేల ఎకరాలు ఒకేసారి డెవలప్‌మెంట్‌కు తీసుకోకుండా, కొద్దికొద్దిగా తీసుకుని ఎప్పటికప్పుడు డబ్బు చెల్లించి కొనేస్తూ, చిన్నచిన్నగా కట్టుకుంటూ వస్తే తన కెపాసిటీ ఏమిటో ఆయనకే అర్థమయ్యేది. తను కల కనగానే అన్ని చోట్ల నుండి డబ్బులు వచ్చి కురుస్తాయని ఆయన ఎలా అనుకున్నారో, తక్కినవాళ్లను ఎలా నమ్మించారో!

ఆయన అప్పనంగా 34 వేల ఎకరాలు సేకరించారని ఆంధ్రజ్యోతి యిప్పటికీ ఆకాశానికి ఎత్తేస్తోంది. పైసా ఖర్చు పెట్టకుండా సంపాదించానని యీయనా చెప్పుకుంటాడు. అదేమి లాజిక్కో నాకర్థం కాదు. పాత యింటిని పడగొట్టి కొత్త ఫ్లాట్లు కట్టి వాటిలో సగం యిస్తానని వచ్చే డెవలపర్‌ 'నాకు పాత యిల్లు అప్పనంగా వచ్చింద'ని చెప్పుకుంటాడా? పాతదాన్ని పడగొట్టి, డెవలప్‌ చేసి, కొత్తది కట్టవలసిన కమిట్‌మెంట్‌ ఉంది కదా! రైతుల గురించి యీ రోజు యింత మాట్లాడుతున్నంత వారంతా బాబు అంత కమిట్‌మెంట్‌ తలకెత్తుకుంటున్నపుడు వారించలేదేం? ఇది జరిగేందుకు దశాబ్దాలు పడుతుంది, అప్పటిదాకా మీరే పాలిస్తారన్న ధీమా ఏమిటి? అని అడిగారా? కనీసం ప్రభుత్వం తరఫున రైతులకు రాతపూర్వకంగా హామీలు యివ్వండి అని అడిగారా?

ఇది ఎందుకంటున్నానంటే రైతుతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఎలా ఉన్నాయో చూడాలనుకున్నాను. పాఠకమిత్రులు, చరిత్రపరిశోధకులు మాదిరాజు గోవర్ధన్‌ (మంగళగిరి) గారు సంపాదించి పెట్టారు. జిఓలో ఉన్న ఇంగ్లీషు వెర్షన్‌, ఒక రైతుతో కుదుర్చుకున్న తెలుగు ఒప్పందం రెండూ చదివాను. వాటిలో ఎక్కడా ప్రభుత్వం, అనగా సిఆర్‌డిఏ ఫలానా తేదీలోగా రాజధాని కడతానని కానీ, మీకు డెవలప్‌డ్‌ స్థలాలు యిస్తానని కానీ కమిట్‌ కాలేదు. ఆ తేదీలోగా కట్టకపోయినా, యివ్వకపోయినా, యింత నష్టపరిహారం యిస్తాననీ అనలేదు.

మునిసిపల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎం2) డిపార్ట్‌మెంట్‌ జిఓ ఎంఎస్‌ నెం.1 తేదీ 1.1.2015 ప్రకారం లాండ్‌ పూలింగ్‌ విధివిధానాలను నిర్ధారించారు. ఏ రకమైన భూమికి బదులుగా ఎలాటి భూమి ఎంతెంత యిస్తారో గత వ్యాసంలోనే రాశాను. 'అథారిటీ షల్‌ గ్యారంటీ రిటర్న్‌ ఆఫ్‌ రీ-కనిస్ట్యూటెడ్‌ లాండ్‌..' అన్నారు తప్ప ఫలానా తేదీ అని రాయలేదు. పదేళ్ల పాటు (ఇప్పుడు జగన్‌ 15 ఏళ్లు యిస్తానంటున్నాడు) యిచ్చే పరిహారం పట్టా భూమి విషయంలో ఏటా 30 వేలు, ప్రతీ ఏడాది 3 వేలు (ఏటా 10% పెంచుతారని గతంలో రాశాను, అది తప్పు) 3 వేలు ఫిక్సెడ్‌. జరీబు భూమి విషయంలో 50 వేలు, 5 వేలు. భూమి లేని కుటుంబాలకు ఏటా రూ.2500 (యికపై 5 వేలు అని జగన్‌ – యిలా 20 వేల కుటుంబాలకు)

డెవలప్‌మెంట్‌ అంటే ఏమిటో వివరించారు – సెక్టార్‌ రోడ్స్‌/ఇంటర్నల్‌ రోడ్స్‌/ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ /సర్వీసెస్‌ (ఇన్‌క్లూడింగ్‌ వాటర్‌ సప్లయ్‌ లైన్స్‌, పవర్‌ సప్లయ్‌, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌ ఎట్సెట్రా. అన్నారు. భూమిని ఏయే వాటికి కేటాయిస్తారో చెప్పారు – పార్కులు, తోటలు, ఆటస్థలాలు, ఖాళీ స్థలాలకు 10%, రోడ్లు, యుటిలిటీ సర్వీసెస్‌కు 30%, స్కూళ్లు, ఆసుపత్రులు వంటి సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 30%, పేదల గృహవసతికి 5%, తక్కినది రైతులకు.

ప్రభుత్వం తరఫు నుంచి చేసిన యితర వాగ్దానాలేమిటంటే – 1. 2014 డిసెంబరు 8 నాటికి అక్కడ నివసిస్తున్నవారికి ఉచిత విద్య, వైద్యం 2. వృద్ధాశ్రమాలు కట్టడం 3. ఎన్టీయార్‌ కాంటీన్లు కట్టడం 4. నరేగా పరిమితిని  ఏడాదికి 365 రోజులకు పెంచడం 5. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలు పెట్టి కౌలు రైతులకు, కార్మికులకు వ్యవసాయంలో నైపుణ్యం పెంచడం 6. నివాసితుల ట్రాక్టర్లను నిర్మాణపు పనుల్లో ఉపయోగించడం, 7. టీక్‌ చెట్ల అమ్మకానికి పరిమితులు యిప్పించడం 8. ఒక భవంతిని ఎమ్‌ఎస్‌ కోటేశ్వరరావు పేర పెట్టడం 9. అప్పటికి ఉన్న పంటను కోసుకోనివ్వడం

సిఆర్‌డిఏ వాళ్లు మొదట రైతులకు 'భాగస్వామ్య దరఖాస్తు మరియు ప్రమాణపత్రము' అని బుక్‌లెట్‌ యిచ్చారు. దానిలో 9-18 (ఎ) నమూనా నివాస మరియు వాణిజ్య ప్లాట్లు కోరు దరఖాస్తు అని ఉంది. అది చదివితే ప్రభుత్వం భూముల్ని తీసుకున్నట్లు లేదు. రైతే 'నా భూముల్ని తీసుకుని, దానికి బదులుగా నివాస, వాణిజ్య ప్లాట్లు యివ్వండి' అని దరఖాస్తు పెట్టుకున్నట్లు ఉంది. దానిలో అగ్రిమెంటు అయిన 9 నెలల లోపుల ధ్రువపత్రాన్ని బదిలీ హక్కులతో యిస్తామని 3 సం.ల లోపున సదరు ప్రాంతమును అభివృద్ధి చేయుట పూర్తి చేయబడును' అని రాశారు. అయితే యీ మూడు సంవత్సరాల విషయం అగ్రిమెంటుకి వచ్చేసరికి ఎగిరింది.

ఆ అగ్రిమెంటు 9-14 అభివృద్ధి ఒప్పందము మరియు ఇర్రోవకబుల్‌ పవరాఫ్‌ ఎటార్నీ అని ఉంది. దీన్నే తర్వాత రూ.100 స్టాంపు పేపరు మీద రాసి యిచ్చారు. రైతు, సిఆర్‌డిఏ తరఫున డిప్యూటీ కలక్టరు సంతకాలు పెట్టారు. ఇది అతి ముఖ్యమైన డాక్యుమెంటు. దీనిలో ముఖ్యవిషయాలేమిటంటే – మీ లాండ్‌ పూలింగ్‌ స్కీము విని నేనే సిఆర్‌డిఏను సంప్రదించి, భూమి యిస్తానన్నాను, దానికి సిఆర్‌డిఏ ఒప్పుకుంది. అందువలన నా భూమిని అప్పగిస్తున్నాను అని భూ యజమాని రాసి యిస్తున్నాడు. దీనిలో మూడేళ్లలో పూర్తి చేస్తామనే హామీ లేదు. అంతేకాదు, మూడేళ్లలో పూర్తి చేయకపోతే ఏ విధమైన నష్టపరిహారం యిస్తామో సిఆర్‌డిఏ చెప్పలేదు.

సరికదా, 'ఏ కోర్టులోనూ ఎక్కువ నష్టపరిహారం చెల్లింపుకు కోరనని ఒప్పుకొనుచున్నందున వారు పిటీషన్లు దాఖలు చేయుటకు ఎటువంటి అర్హత కలిగి ఉండరు. అట్టి పిటిషను దాఖలు చేస్తే చెల్లుబాటు కాదని చట్టవ్యతిరేకం అవుతుందని, సిఆర్‌డిఏ ఉత్తర్వులకే కట్టుబడి ఉంటామని అంగీకరించడమైనది.' అని రైతు రాసి యిచ్చినట్లు క్లాజ్‌ పెట్టారు. సుజనా ఊహిస్తున్న మూడు రెట్లు ఎక్కువ నష్టపరిహారం లాటివి భూసేకరణ చట్టానికే తప్ప దీనికి కాదు. మూడు సంవత్సరాల మాట పై జీఓలో కానీ దాన్ని సవరణ చేసిన 2015 ఏప్రిల్‌ జిఓలో కానీ ఆ మూడు సంవత్సరాల మాట లేదు. మీరూ చెక్‌ చేసి చూడండి. 

APCRDA Rules 1

APCRDA Rules 2

'మూడు సంవత్సరాలకు మించితే యింత నష్టపరిహారం యిస్తాం అని లేదు కానీ, మూడు సంవత్సరాల్లో డెవలప్‌ చేసి యిస్తాం అని 9-14లో మాకు తెలిసున్నవారి ఒప్పందంలో ఉంద'ని కొందరంటున్నారు. మీకు తెలిసిన వారెవరిదైనా ఒప్పందం దొరికితే వెరిఫై చేసి చూడండి. కొందరికి ఒకలా, మరి కొందరికి యింకోలా యిచ్చారా? లేకపోతే మొదట్లో మూడేళ్ల హామీ యిచ్చి, తర్వాత ఒప్పందం మోడల్‌ మార్చేశారా? తేలాలి. నా దగ్గరున్నది 2018 ఆగస్టు నాటిది. 9-14లో 8 వ అంశంగా రాసినదేమిటంటే – 'ఉభయపక్షాలు అంగీకరించిన కాలవ్యవధి మరియు షరతులకు లోబడి పథకం మొత్తం పూర్తి అయిన తరువాత రైతుకి తిరిగి అందజేయడానికి అంగీకరించడమైనది' అని. ఆ కాలవ్యవధి గురించి ఉభయపక్షాలు రాసుకున్న వేరే ఒప్పందమేమీ నాకు కానరాలేదు.

మన పాత భవనాన్ని ఎవరైనా డెవలపర్‌కు యిచ్చినపుడు 18 నెలల్లోనో, 24 నెలల్లోనే డెవలప్‌ చేసి యిస్తామని వాడు రాసి యిస్తాడు. ఆలస్యమైతే నెలకింత అద్దె యిస్తానంటాడు. ఇక్కడ సిఆర్‌డిఏ అలాటి టైమ్‌ ఫ్రేమ్‌ యిచ్చినట్లు లేదు. (సబ్జక్ట్‌ టు కరక్షన్‌) ఒకవేళ ఆ టైముకి యివ్వకపోతే యింత నష్టపరిహారం చెల్లిస్తాను అనే క్లాజు అసలే లేదు. (అది ఏ జిఓలోనూ, ఏ బుక్‌లెట్‌లోనూ, ఎవరి అగ్రిమెంటు లోనూ లేదు). ఇది అన్యాయం కాదా? వైసిపి వాళ్లు డెవలప్‌ చేసి యిస్తామంటున్నారు కానీ ఫలానా తేదీ లోపున యిస్తామని చెప్పటం లేదు. రైతులు వాళ్లను నిలదీసి అడగనూ లేరు. ఏటేటా యిస్తామంటున్నది కౌలు తప్ప, ఆలస్యానికి నష్టపరిహారం కాదు. రైతులు అడగగలిగిన అంశం ఏదైనా ఉందా అంటే – 'రాజధానికై భూములు యిస్తున్నాం' అని వాళ్లు రాసి యిచ్చారు. అందుకనే వైసిపి అతి తెలివి ప్రదర్శించి దీనికి శాసన రాజధాని అని పేరు పెట్టి ఒప్పందభంగం కాకుండా చూసింది. దాని వలన ఒరిగేది ఏమీ లేదనేది రైతుల వెతలకు కారణం!  

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)