ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. బీజేపీ జాతీయ నేతలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, లక్ష్మణ్ లు కిరణ్ కుమార్ రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ తరపున అనేక పదవులు చేపట్టిన కిరణ్ 2010 నవంబర్ నుండి 2014 మార్చి వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా పని చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి.. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పార్టీ స్థాపించి ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు.. ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన అనంతరం మళ్లీ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన ఇవాళ బీజేపీలో చేరారు.
బీజేపీలోకి చేరిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 1952 నుంచి తమ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉందని, అసలు తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని.. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎవరినీ సంప్రదించకుండా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. కాగా సీఎంగా పని చేసిన నాయకుడు పార్టీ చేరుతున్న విష్ణువర్ధన్ రెడ్డి మినహా రాష్ట్ర స్థాయి పెద్ద నాయకులు ఎవరు హాజరుకాకపోవడం గమనార్హం.