చిత్రం: రావణాసుర
రేటింగ్: 2.25/5
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, జయరాం, పూజిత పొన్నాడ, హైపర్ ఆది, రావు రమేష్, శ్రీరాం, దక్ష నగర్కర్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు
కెమెరా: విజయ్ కార్తిక్ కన్నం
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీంస్
నిర్మాత: అభిషేక్ నామా, రవితేజ
దర్శకత్వం: సుధీర్ వర్మ
విడుదల: 7 ఏప్రిల్ 2023
ఆగకుండా సినిమాలు చేస్తున్న రవితేజ “రావణాసుర”తో ముందుకొచ్చాడు. ట్రైలర్ చూస్తే భారీ తారాగణంతో మంచి యాక్షన్ సినిమాని తలపించేలా అనిపించింది. ధమాకా, వాల్తేర్ వీరయ్య ఊపులో ఆ వరుసలో వస్తున్న సినిమా కనుక అంచనాలు కూడా ఏర్పడడం సహజం. ఇంతకీ ఇందులో ఏముందో చూద్దాం.
ఒకే పాటర్న్ లో విచిత్రంగా హత్యలు జరుగుతుంటాయి. వాటన్నిటికీ మూలం ఒకడే అని, వాడెవడో కనిపెట్టాలని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బయలుదేరతాడు. అసలు హంతకుడిని పట్టుకునే లోపు మరిన్ని హత్యలు జరుగుతుంటాయి. ఆ హంతకుడెవరు? దొరక్కుండా ఎంత తెలివిగా తప్పించుకుంటున్నాడు? హత్యలకు కారణమేంటి? అదే కథ.
ఇలాంటి కథని హ్యాండిల్ చేయడానికి పదునైన స్క్రీన్ ప్లే అవసరం. ఆద్యంతం ఉత్కంఠ గొలపాలి. ప్రతి డైలాగ్ ఎందుకు పెడుతున్నామో, ఫలానా షాట్ ఎందుకో..అన్నిటికీ లెక్కుండాలి.
ఎంత సినిమాటిక్ లిబెర్టీస్ తీసుకున్నా కాస్తైనా లాజిక్ కి దగ్గరగా అనిపించాలి.
– మాస్క్ పెట్టుకుంటే మొహం మారుతుంది కానీ బాడీ అంతా ఎలా మారిపోతుంది?
– ఈ రోజుల్లో కూడా ఇంకా కాయిన్ బాక్సులు ఉన్నాయా?
– పోలీస్ స్టేషన్లో గోడ మీద ముఖ్యమంత్రి కేసీయార్ ఫొటో పెట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా వేరే ఎవర్నో చూపిస్తాడేంటి?
– తానే హత్యలన్నీ చేసానని హంతకుడు ఒప్పేసుకున్నా కూడా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఎందుకు అరెష్ట్ చెయ్యడు? పైగా అనుమానం సరిపోదు, ఆధారం కావాలంటాడేంటి? హంతకుడే ఒప్పుకున్న దానికంటే ఆధారం ఏముంటుంది?
…ఇలాంటి ప్రశ్నలు చికాకు పెట్టేస్తుంటాయి ఈ సినిమా చూస్తున్నంత సేపూ.
సినిమా మొదలైన కాసేపటి నుంచీ హీరో విలన్ లాగే ప్రవర్తిస్తుంటాడు. హత్యలు చేస్తుంటాడు, అమ్మాయిల్ని బందీ చేస్తాడు, రేపులు చేస్తాడు…ఇలా చాలా! ..సదరు థ్రిల్లర్ సినిమాల్లో సీరియల్ కిల్లర్ టైపులో అన్నమాట. కానీ చట్టానికి దొరకడు. అలా దొరక్కుండా హత్యలు చేయడం “ఆర్ట్” అని సమర్ధించుకునే విలన్ మన హీరో.
ఇలాంటి సినిమాల్లో ఆ పాత్రకి జస్టిఫికేషన్ రావాలంటే అతని చేతిలో చచ్చిన వాళ్లందరికీ ఒక క్రైం తో డైరెక్ట్ సంబంధం ఉండి ఉండాలని, అందులో హీరో కానీ, అతని పెళ్లామో ప్రేయసో కానీ విక్టిం అవ్వొచ్చని వందలాది సినిమాలు చూసిన ప్రేక్షకులు ఒక అంచనాకి వస్తారు. అంచనాల్ని నిరుత్సాహపరచకుండా అత్యంత పేలవంగా, దారుణమైనంత ప్రెడిక్టిబుల్ గా ముగుస్తుంది క్లైమాక్స్. ఎక్కడా కూడా ఫలానా ట్రాక్ అద్భుతమనడానికి లేకుండా ఉంది.
ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగానే ఉన్నా రవితేజను పెట్టి తియ్యాలనుకోవడమే మైనస్సయ్యింది.
కథకి శ్రీకాంత్ విస్సా పేరు పెట్టినా ఇది “వించి దా” అనే ఒక బెంగాలి చిత్రం ఫ్రీమేక్. దానిని కొంత మార్చి కలగాపులగం చేసారు. పాయసాన్ని రీమేక్ చెయ్యాలని మొదలుపెట్టి, దానికి కాస్త స్పైసీనెస్ యాడ్ చెయ్యాలని ఉప్పు కారం జల్లితే ఎలా ఉంటుందో ఈ కథని అలా తయారు చేసారు. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ లో తొలి సగంలో చాలాసేపు రొమాంటిక్ ట్రాక్ పెట్టడం, సెకండాఫ్ లో పాత్రల మధ్య సంబంధాన్ని దృష్టిలో పెట్టుకోకుండా డ్యూయెట్స్ పెట్టడం లాంటివి దయనీయమైన రచనకు తార్కాణాలు.
టెక్నికల్ గా చూసుకున్నా కూడా చాలా సోసో గా ఉన్న చిత్రమిది. పాటలు ఆకట్టుకోవు. “వెయ్యిన్నొక్క జిల్లాల వరకు..” పాట రీమిక్స్ తేలిపోయింది. అసలా పాట ఎందుకు పెట్టారో, దేనికి ఖూనీ చేసారో కారణం కూడా లేదు.
కథ, కథనం రెండూ పాకనపడకుండా దింపేసారు.
రవితేజ డ్యాన్సులు అద్భుతంగా చెసాడు. పాజిటివ్ పాయింట్ చెప్పాలంటే ఇదొక్కటే. అంతకు మించి అసలీ పాత్రే అతనికి నప్పలేదు. నరరూప రాక్షసుడిగా కనిపిస్తూ ఎక్కడా మనసుకి హత్తుకోకుండా ఉన్న పాత్ర ఇది. చివరికి కూడా సింపతీ రాదు.
సుశాంత్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగినా అతని క్యారెక్టర్ మాస్కులు తయారు చేయడం తప్ప చేసిందేమీ లేదు.
ఫరియా అబ్దుల్లా పాత్ర అనవసరమనిపించేలా ఉంది. శ్రీరాం కూడా ఓకే.
మేఘ ఆకాష్ ది కాస్త ప్రాముఖ్యమున్న పాత్ర. ఆమె బాగానే చేసింది.
మురళి శర్మది గెస్ట్ పాత్రకంటే కాస్తంత పెద్దది అంతే.
రావు రమేష్ కి తెలంగాణా యాస చాలా కృతకంగా ఉంది.
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా జయరాం పాత్రని ఇంకా పవర్ఫుల్ గా, తెలివిగా నడిపుండాలి.
హైపర్ ఆది ఎందుకున్నాడో తెలీదు. నాలుగు పంచులేస్తే జనం విజిల్స్ వేస్తారనుకుని ఉండొచ్చు కానీ, ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప పంచులు పండనే పండలేదు.
మిగిలిన నటీనటులంగా జస్ట్ ఓకే. ఎవ్వరూ పాత్రల్లో ఒదిగి నటించినట్టు కనపడలేదు. స్క్రీన్ ప్లేలో ఒక ఆర్గానిక్ ఫ్లో లేకపోవడం, నిడివి పెంచడానికి తప్ప మెయిన్ ఫ్లో కి సరిపడని సీన్లు పెట్టడమే ఆర్టిస్టుల ఇన్వాల్వ్మెంట్ రిజిస్టర్ కాకపోవడానికి ఒక కారణం.
వరుస పరాజయాలతో దూసుకుపోతున్న రవితేజకి “ధమాక” అడ్డుకట్ట వేసి హిట్టిచ్చింది. ఆ వెంటనే “వాల్తేర్ వీరయ్య” రూపంలో కూడా హిట్టొచ్చింది. సినిమాలు హిట్టైపోతున్నాయని కంగారు పడిన రవితేజ ఫ్లాపవ్వడానికి సరైన సినిమాని ఎంచుకుని తలపెట్టినట్టుంది ఈ సినిమా. లేకపోతే అసలిది రవితేజ చెయ్యాల్సిన సినిమా కాదు.
రొటీన్ గా కాకుండా వైవిధ్యంగా ట్రై చేసాడని చెప్పుకోవచ్చు. కానీ అలా చెసినప్పుడు రొటీన్ కంటే గొప్పగా అనిపించాలి. అంతే తప్ప నొసట్లు చిట్లించేలా ఉండకూడదు. పైగా రవితేజ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే నటుడు. అతనిని పెట్టుకుని “సెమెన్ ని కళ్లాపి జల్లడం” లాంటి డైలాగ్స్, హీరోయిన్ స్థాయి నటిని మెడ కోసి చంపే దృశ్యాలు, అమ్మాయిల మీద పడి రేప్ చెయ్యడాలు..ఇవన్నీ అవసరమా!
ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరంగా పెట్టే రవితేజ సినిమాగా ఇది నిలిచిపోతుంది. మాస్ ఆడియన్స్ కి కూడా వెగటు పుట్టేలాగా, ఫ్యాన్స్ ని సైతం నిరాశపరిచేలాగ..మొత్తంగా ఏ వర్గానికీ దగ్గర కాకుండా ఉండేలా ఉన్న సినిమా ఇది.
బాటం లైన్: రాక్షస హీరో కథ