మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఎవరూ ఏదో అన్నారని చంద్రబాబు గుక్కపెట్టి ఏడ్చారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ఏడ్వాల్సింది అందుకు కాదని ఆయన అన్నారు. లోకేశ్ లాంటి పప్పును, పనికిమాలినోడిని కొడుకుగా కన్నందుకు చంద్రబాబు ఏడ్వాలని ఆయన ఘాటు విమర్శలు చేయడం గమనార్హం.
పాదయాత్రలో లోకేశ్ ప్రజాసమస్యలపై మాట్లాడ్డం లేదన్నారు. నోటికొచ్చినట్టు ప్రత్యర్థులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని శంకర్ నారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో తన మార్క్ అజ్ఞానపు వ్యాఖ్యలు చేస్తూ లోకేశ్ అభాసుపాలవుతున్నారు. ఎస్కే యూనివర్సిటీలో దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి లాంటి వారు చదివారని చెప్పి, పప్పులో కాలేశారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది.
ఇదిలా వుండగా అసెంబ్లీలో తన భార్యపై మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్య చేశారంటూ చంద్రబాబు ఏకంగా చట్టసభనే బహిష్కరించారు. తిరిగి ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. తన భార్యను కించపరిచేలా మాట్లాడారంటూ చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక సభల్లో చంద్రబాబు తన భార్య ఉదంతాన్ని చెబుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బాబు వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అడవాళ్లని అడ్డు పెట్టుకుని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే కుయుక్తులకు చంద్రబాబు మొదటి నుంచి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. లోకేశ్ కూడా పలు సందర్భాల్లో తన తల్లిని అవమానించారని, ఏ ఒక్కర్నీ వదిలి పెట్టనని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం తెలిసిందే. ఇవాళ మాజీ మంత్రి శంకర్ నారాయణ మరోసారి బాబు భార్యకు సంబంధించి తేనెతుట్టెను కదిలించారు. లోకేశ్ లాంటి కొడుకును కన్నందుకు వెక్కివెక్కి ఏడ్వాలని హితవు చెప్పడం చర్చనీయాంశమైంది.