రాముల‌మ్మకు దొరికిందో పాయింట్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై దుమ్మెత్తి పోసేందుకు విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ సిద్ధంగా ఉంటారు. అనేక పార్టీలు మారినా ఎక్క‌డా స్థిర‌త్వం దొర‌క‌లేదామెకు. టీఆర్ఎస్‌లో ఎంపీగా కుదురుగా ఉంద‌నిపించినా… ఎందుకోగానీ అక్క‌డ కూడా ఉండ‌లేక‌పోయారు. ఆ…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై దుమ్మెత్తి పోసేందుకు విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ సిద్ధంగా ఉంటారు. అనేక పార్టీలు మారినా ఎక్క‌డా స్థిర‌త్వం దొర‌క‌లేదామెకు. టీఆర్ఎస్‌లో ఎంపీగా కుదురుగా ఉంద‌నిపించినా… ఎందుకోగానీ అక్క‌డ కూడా ఉండ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌, ఇటీవ‌ల బీజేపీలోకి జంప్ అయ్యారు. అంతిమంగా ఆమె టార్గెట్ మాత్రం కేసీఆరే. దీన్ని బ‌ట్టి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఆమె ఎంత‌గా ర‌గిలిపోతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.  

రానున్న విద్యా సంవ‌త్స‌రం నుంచి తెలంగాణ‌లో ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్టాల‌ని తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యించింది. రాముల‌మ్మ దృష్టిలో ఇదే నేర‌మైంది. సోష‌ల్ మీడియాకెక్కి కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు. కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌రుస‌గా 8 ట్వీట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

రాజకీయ నాటకాలకు తెరతీస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమ‌ని విజ‌య‌శాంతి హెచ్చ‌డం విశేషం. ఇంకా ఆమె ఏమ‌న్నారంటే….

కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని గప్పాలు కొట్టిన సీఎం కేసీఆర్ మారుమూల గ్రామాల విద్యార్థులకు సర్కారీ విద్యను దూరం చేసి పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని పెంచార‌ని వాపోయారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామంటూ కేసీఆర్ కొత్త డ్రామా మొదలెట్టారని విజ‌య‌శాంతి ఎద్దేవా చేశారు. 

అసలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, పిల్లల కోసం టాయిలెట్లు కూడా నిర్మించలేని దుస్థితి నెలకొందని విమ‌ర్శించారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పిన కేసిఆర్ ఏనాడూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

ఏడేళ్లుగా టీచర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా… విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను ఎలా అందిస్తారో కేసీఆర్ చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఏ ర‌కంగా చూసినా ఆంగ్ల మాధ్య‌మం అమ‌లు సాధ్యం కాద‌నేది రాముల‌మ్మ అభిప్రాయం. 

కేవ‌లం పేద ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డానికి కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డే ఆంగ్ల మాధ్య‌మ‌ని ఆమె ట్వీట్ల‌లోని అంత‌రార్థంగా ప‌లువురు చెబుతున్నారు. ఇంకా కేసీఆర్ ఇంగ్లిష్ మీడియంపై విమ‌ర్శ‌లు మొద‌లు కాలేద‌ని భావిస్తున్న త‌రుణంలో విజ‌య‌శాంతి మొద‌లు పెట్టార‌ని చెప్పొచ్చు.