ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు థియేటర్లలోకి రావాలో తెలియని అగమ్యగోచరం. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఆర్ఆర్ఆర్ ను ఎక్కువ రోజులు దాచిపెట్టలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్ లో రాజమౌళి ఎలా ఆలోచిస్తాడు? ఓ రిలీజ్ డేట్ చెప్పడం, తర్వాత మళ్లీ వాయిదా బాట పట్టడం ఎందుకని అనుకున్నాడేమో.. ఈసారి ఏకంగా 2 రిలీజ్ డేట్స్ తో ముందుకొచ్చాడు జక్కన్న.
అవును.. ఆర్ఆర్ఆర్ కోసం 2 రిలీజ్ డేట్స్ లాక్ చేశారు. కరోనా/లాక్ డౌన్ పరిస్థితులన్నీ సద్దుమణిగి, దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటే మార్చి 18కి సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రాజమౌళి ప్రకటించాడు. ఒకవేళ ఆ తేదీకి దేశవ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. ఏప్రిల్ 28కి సినిమా థియేటర్లలోకి వస్తుందని కూడా శెలవిచ్చాడు.
ఇలా ఒకేసారి 2 తేదీలు లాక్ చేసి, టాలీవుడ్ జనాలకు షాకిచ్చాడు రాజమౌళి. ప్రస్తుతానికైతే మిగతా సినిమాలేవీ ఈ రెండు తేదీల వైపు తొంగి చూసే అవకాశాలు లేకుండా చేశాడు. మార్చి 18కి ఆర్ఆర్ఆర్ వచ్చేస్తే.. ఏప్రిల్ 28 ఖాళీ అన్నమాట. ఒకవేళ మార్చి 18కి రాకపోతే మాత్రం ఆర్ఆర్ఆర్ తో పాటు మరో పెద్ద సినిమా ఆ తేదీకి రావడం (సమయాభావం వల్ల) కష్టం అవుతుంది.
ఈ సంగతి పక్కనపెడితే.. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై టాలీవుడ్ కు ఓ చిన్న స్పష్టత ఇచ్చాడు రాజమౌళి. సంక్రాంతి టైమ్ లో ఎదుర్కొన్న విమర్శలు, వివాదాలకు తావివ్వకుండా ఇలా మధ్యేమార్గాన్ని అనుసరించాడు.