ఏపీ శాసనమండలి రద్దు విషయంలో ఊహాగానాలు నిజం అయ్యాయి. ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి కొద్ది సేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో.. మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకుంది రాష్ట్ర కేబినెట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ తీసుకున్న నిర్ణయాలకు మండలి అడ్డు పడటంతో.. దాని అవసరం గురించి ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మండలిరద్దు ఊహాగానాలు ఏర్పడ్డాయి. చివరకు అవే నిజం అయ్యాయి.
ఏపీ కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో.. శాసనసభలో ఆ తీర్మానం ఆమోదం పొందడం కూడా సులువే. మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఈ రోజే ఆమోదించే అవకాశం ఉంది. ఇక మండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ తీర్మానాన్ని ఢిల్లీలో పాస్ చేయించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానం అక్కడ ఆమోదం పొందితే.. అక్కడితో శాసనమండలి ప్రస్థానం ముగుస్తుంది. అయితే ఆ ఆమోదం తేలిక కాదని.. దానికి ఆరు నెలలు, సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు సమయం పడుతుందని తెలుగుదేశం నేతలు చెబుతూ ఉన్నారు. అంత వరకూ మండలి మనుగడలో ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.