సౌతిండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఒకటి మోహన్ లాల్- ప్రియదర్శన్ కాంబినేషన్. వీళ్లిద్దరూ మలయాళంలో రూపొందించిన అనేక సినిమా ఆ తర్వాత వివిధ భాషల్లో రీమేక్ అయ్యాయి. ఆయా భాషల్లో కూడా సదరు సినిమా క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. అలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఉంది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ మలయాళంలో కలిసి చేసిన సినిమా ఒకటి 'కనుపాప'పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది.
అదలా ఉంటే.. ఇప్పుడు 'మరక్కర్' సినిమా టీజర్ తో ఆసక్తిని రేపుతూ ఉన్నారు మోహన్-ప్రియన్. పోర్చగీసు వారు కేరళ వైపుకు తొలి సారి వచ్చినప్పటి పరిణామాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతూ ఉంది. కేరళ తీరంలోకి పోర్చుగీసు వారు ప్రవేశించడంతో భారత దేశంపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది. అక్కడ నుంచి దేశ చరిత్ర మరో టర్న్ తీసుకుంది. ఆ పరిణామాల్లో పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడిన నావిక దళానికి మరక్కర్ అనే యోధుడు నాయకత్వం వహించారని కేరళ చరిత్ర చెబుతూ ఉంది. ఆయన కథ ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు.
ఇది వరకూ భారత స్వతంత్ర పోరాటానికి సంబంధించి ఒక అద్భుతమైన సినిమాను ప్రియదర్శన్ రూపొందించారు. అందులో మోహన్ లాల్ హీరోగా నటించాడు. 'కాలాపానీ' పేరుతో రూపొందిన ఆ సినిమా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతూ ఉన్నట్టుంది. మార్చి 26న ఈ సినిమా మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది.