అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన వారికి లాభసాటి వ్యవహారాల్లో ఒకటి అధ్యక్ష హోదాలో తమ అనుభవాలను గ్రంథస్థం చేయడం అని చెబుతూ ఉంటారు. రెండు పర్యాయాల పాటు అధ్యక్షులుగా పని చేసిన వారు వైట్ హౌస్ లో తమ అనుభవాలు, అంతర్జాతీయ పర్యటనలు, ఎదుర్కొన్న కీలకమైన సవాళ్లు వంటి వాటి గురించి విశదీకరిస్తే వాటిని పుస్తకాలుగా ప్రచురించే సంస్థలు వందల కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటాయి.
అమెరికా అధ్యక్షుల పుస్తకాలకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉండటం, అమెరికాలో వాటి అమ్మకాలు మంచి స్థాయిల్లో ఉండటంతో ఈ పరంపర కొనసాగుతూ ఉంది.
తాజాగా బరాక్ ఒబామా పుస్తకం సంచలనం రేపుతూ ఉంది. 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పేరుతో ఒబామా పుస్తకాన్ని రచించారు. మొత్తం రెండు భాగాలుగా ఆ పుస్తకం విడుదల అవుతోంది. అందులో ఫస్ట్ పార్ట్ లో ఒబామా ఇండియన్ పొలిటీషియన్ల గురించి, అమెరికన్ పొలిటీషియన్ల గురించి వ్యక్తీకరించిన అనుభవాలు సంచలనం రేపుతూ ఉన్నాయి.
ప్రత్యేకించి రాహుల్ గాంధీ గురించి ఒబామా తన ఫస్ట్ ఇంప్రెషన్ ను వ్యక్తీకరించిన వైనం కాంగ్రెస్ వీరాభిమానులను ఇబ్బంది పెడుతూ ఉంది. అలాగే ఈ పుస్తకంలో ఒబామా తన అనుభవాలు బోలెడన్నింటినీ రంగరించి రచించినట్టుగా ఉన్నారు.
ఈ పుస్తకం ప్రచురణకు ఒబామాకు భారీ మొత్తాన్ని ఇచ్చారట పబ్లిషర్స్. ఒబామా పుస్తకం రెండు భాగాల ప్రచురణ హక్కులతో పాటు, మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా రాసే పుస్తకానికి కలిపి మొత్తం 485 కోట్ల రూపాయలను చెల్లించిందట పెంగ్విన్ ర్యాండమ్ హౌస్.
అమెరికన్ ద్రవ్యమానంలో చూసినా ఇది భారీ మొత్తమే అని వేరే చెప్పనక్కర్లేదు. అమెరికాకు కొత్త అధ్యక్షుడు రాబోతున్న తరుణంలో నాలుగేళ్ల విరామంతో ఒబామా రాసిన అనుభవాలకే ఇంత రేటు అంటే.. ట్రంప్ తనదైన రీతిలో పుస్తకం రాస్తే అది మరింత సంచలన సృష్టించి, మరింత రేటు పలికే అవకాశం ఉందేమో!