ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ ను ఎన్డీయేలో ఉంచడమా, పక్కన పెట్టడమా అనేది తను బీజేపీకే వదిలిపెట్టినట్టుగా ప్రకటించారు నితీష్ కుమార్. బహుశా ఇప్పుడు నితీష్ కు అంతకన్నా ఛాయిస్ లేదు. ఎల్జేపీ దెబ్బతో జేడీయూ అనేక చోట్ల ఓటమి పాలయ్యింది.
బీజేపీ పోటీ చేసిన సీట్లలో ఎల్జేపీ తన అభ్యర్థులను పోటీలో పెట్టలేదు. తమ లక్ష్యం కేవలం నితీష్ కుమార్ ను ఓడించడమే అని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించుకున్నారు.
అయితే ఒకరకంగా చిరాగ్ లక్ష్యం నెరవేరింది. మరో రకంగా నెరవేరలేదు. జేడీయూను వీక్ చేయగలిగాడు కానీ, నితీష్ ను మరోసారి సీఎం కాకుండా ఆపలేకపోయాడు ఎల్జేపీ ముఖ్యనేత.
ఎలాగూ నితీషే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ ప్రకటించి కాబట్టి.. నిజంగానే నితీష్ మీద కోపముంటే ఎల్జేపీ బీజేపీ పోటీ చేసిన చోట కూడా బరిలోకి దిగాల్సింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కి ఎదురెళ్లే సాహసానికి ఎల్జేపీ యువనేత వెళ్లలేకపోయారు. అయితే ఇప్పుడు నితీష్ నిష్టూరమాడుతున్నాడు.
అసలు చిరాగ్ పాశ్వాన్ పోటీనే బీజేపీ వ్యూహం ప్రకారం జరిగిందనే టాక్ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ పాశ్వాన్ ను బీజేపీ దూరం చేసుకునే అవకాశాలే లేవు. నితీష్ మాటలను కమలం పార్టీ పూర్తిగా లైట్ తీసుకోవచ్చు.
అంతేకాదు.. ఇప్పుడు వినిపిస్తున్న మరో విశ్లేషణ ఏమిటంటే చిరాగ్ ను బీజేపీ చేర్చుకోవచ్చు అని. బిహార్ లో బీజేపీ నాయకత్వ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎక్కువగానే సీట్లు నెగ్గినా తమ పార్టీ వాళ్లలో ఫలానా వ్యక్తిని సీఎంగా చేయవచ్చు అని బీజేపీ నమ్మకంగా స్పందించలేకపోతోంది.
నితీషే దిక్కు అని ఎన్నికల ముందే ప్రకటించింది, ఇప్పుడు కూడా అంతకు మించి ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే చిరాగ్ పాశ్వాన్ ను బీజేపీ చేర్చుకుని భావినేతగా తయారు చేసుకోవచ్చు అనేది ఒక విశ్లేషణ.
అయితే సామాజికవర్గం లెక్కల ప్రకారం చిరాగ్ కు బీజేపీ పెద్ద పీట వేస్తుందా? స‌్వతంత్రంగా ఉన్నప్పుడు చిరాగ్ కు ఉండే మద్దతు బీజేపీలోకి చేరితే ఉంటుందా? అనేవి సందేహాలే.