ఒకరేమో ముస్లిం ఓట్లను చీల్చుకు వెళ్తున్నారు, మరొకరు దళిత ఓటు బ్యాంకును దండుకుంటున్నారు… బీజేపీ వ్యతిరేక ఓటును చీలికలు పీలికలు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తూ కమలం పార్టీకి వెల కట్టలేని సాయం చేస్తున్నారు.
అనునిత్యం బీజేపీ విధానాలను విమర్శిస్తూ, బీజేపీపై విరుచుకుపడుతూ.. అంతిమంగా బీజేపీకి అంతులేని సాయం చేస్తున్న వారిద్దరే ఎంఐఎం నేత అసదుద్ధీన్ ఒవైసీ, బీఎస్పీ అధినేత్రి మాయవతి.
ఆ మధ్య ఒక విశ్లేషకుడు స్పందిస్తూ.. బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడిచిపోయినా ఇప్పటి వరకూ అసదుద్ధీన్ ఒవైసీకి కించిత్ అసౌకర్యం కలగలేదు గమనించారా అని గుర్తు చేశారు.
రెండ్రోజుల కిందట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఓల్డ్ సిటీ అంటూ దుమ్మెత్తి పోశారు. అయితే ఒవైసీపై బీజేపీ ఆగ్రహం కేవలం మాటల వరకే. ఒవైసీ ఉంటేనే బీజేపీ తను చేయాలనుకున్న రాజకీయం చేయగలుగుతుంది అనేది విశ్లేషకుల మాట.
అలాంటి ఒవైసీ కేవలం పాతబస్తీకి పరిమితం కాలేదు. మహారాష్ట్ర కెళ్లాడు, బిహార్ లో ఐదు సీట్లు గెలిచాడు, రేపు బెంగాల్ లో ఆ పై ఒరిస్సాలో.. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ముస్లింల జనాభాగా గణనీయంగా ఉన్న చోట ఒవైసీ ఉనికిని చాటుకుంటూ ఉన్నారు.
ఒవైసీ ఎక్కడ జెండా పాతినా అది బీజేపీకి మేలు చేసే అంశమే అవుతోంది. ఓట్ల లెక్కల్లో ఒవైసీ బీజేపీ గెలుపుకు తన వంతు సహకారం అందిస్తున్నారు. బిహార్ లెక్కలనే తీసుకుంటే.. అక్కడ ఎంఐఎం, బీఎస్పీ తదితర పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ కూటమి ఆరు సీట్లను నెగ్గింది.
అనేక చోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ విజయావకాలను గండి కొట్టింది. అక్కడ వచ్చిన స్వల్ప మెజారిటీలను లెక్కలోకి తీసుకుంటే.. ఎంఐఎం, బీఎస్పీలు బీజేపీ వ్యతిరేక పక్షానికి భారీ నష్టమే చేశాయి. అలా బీజేపీకి ఎంతో మేలు చేశాయి ఈ పార్టీలు. బీఎస్పీ తరఫున గెలిచే వాళ్లు తీరా గెలిచిన తర్వాత ఎటైనా గెంతుతారు. అయినా మాయవతి మాత్రం తన వంతుగా కమలం పార్టీకి సాయంగా నిలుస్తూ ఉన్నారు.
మాటల్లో మాత్రం ఒవైసీ, మాయవతి బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తారు. బీజేపీ కూడా వీళ్లపై విరుచుకుపడుతుంది. ఇక తమ తదుపరి టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని ఒవైసీ ప్రకటించుకున్నారు. అక్కడ ఎంఐఎం ఏం చేస్తుందో!