కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి పెళ్లి కొడుకు కాబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే అతడి ఒక ఇంటి వాడు కాబోతున్నాడని తెలుస్తోంది. తమ సమీప బంధువుల అమ్మాయినే నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడట. తన తల్లి తరఫు బంధువుల అమ్మాయిని నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సమాచారం. ఆ కుటుంబం జేడీఎస్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గానే ఉంటుందట. ఇలా సొంత పార్టీలో ఉన్న, బంధువుల కుటుంబం అమ్మాయిని నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
కుమారస్వామి తనయుడిగా నిఖిల్ సినిమా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జాగ్వార్ అనే సినిమాతో నటుడిగా మారాడు. దాన్ని కన్నడతో పాటు తెలుగులో కూడా రూపొందించారు. అయితే ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కన్నడలో ఒకటీ అర సినిమాలు చేశాడు నిఖిల్. ఆ మధ్య వచ్చిన మహాభారత సినిమాలో అభిమన్యుడి రోల్ చేశాడితను.
ఇక గతంలో ఒక తెలుగమ్మాయిని నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపార కుటుంబంతో వియ్యమందనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అదేం జరగలేదు. ఇప్పుడు నిఖిల్ పెళ్లి కుదిరినట్టుగా తెలుస్తోంది.