బీసీలను వాడుకుని టీడీపీ పలు దఫాలు అధికారాన్ని సొంతం చేసుకుంది. బీసీల పార్టీగా గొప్పగా చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటే. అయితే టీడీపీ వల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదు. ఏపీ విభజిత రాష్ట్రంలో మొట్టమొదటగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది. అప్పుడు మాత్రం సొంతింటిని చక్క దిద్దుకోవడం తప్ప, ఏ ఒక్క సామాజిక వర్గానికి మంచి చేసిన దాఖలాలు లేవు.
ఇప్పుడు అధికారం పోగానే చంద్రబాబు, లోకేశ్‌లకు అందరూ గుర్తు కొస్తున్నారు. పాదయాత్రలో లోకేశ్ ప్రగల్భాలు వినడానికి సాధ్యం కావడం లేదు. బీసీలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో తాము అధికారంలోకి వస్తే… బీసీ రక్షణ చట్టం తెస్తామని లోకేశ్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో గురువారం 62వ రోజు లోకేశ్ పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా బీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీడీపీ రాగానే బీసీ రక్షణ చట్టం తెస్తామని నారా లోకేశ్ అన్నారు. నియోజకవర్గాల వారీగా బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాలనలో అత్యధిక బీసీలకు పదవులు కట్టబెట్టారు. రిజర్వేషన్‌కు మించి ఆయన అధికారంలోనూ, పార్టీలోనూ బీసీలకు అగ్రస్థానం కల్పించారు. ఇంతకంటే వారిని ఆదరించే పరిస్థితి వుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం పక్కన పెడితే, ఆయన తక్షణం చేయాల్సిన పని ఒకటుంది. టీడీపీ రక్షణ చట్టం తీసుకొచ్చేందుకు లోకేశ్ ప్రయత్నించాలి. టీడీపీ భవిష్యత్ లోకేశ్ చేతల్లోనే వుంది. టీడీపీ శ్రేణుల భయం కూడా అదే. చంద్రబాబు తర్వాత టీడీపీని కాపాడే దిక్కు లేదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
లోకేశ్‌కు పార్టీని నడిపేంత సీన్ లేదని టీడీపీ నేతలే అంటున్నారు. లోకేశ్ తన వెకిలి చేష్టలతో టీడీపీని మరింత బద్నాం చేస్తున్నారనేది వాస్తవం. తన వల్ల టీడీపీకి ప్రమాదం వాటిల్లకుండా, ఏదైనా మంచి కార్యం తలపెడితే, పార్టీ శ్రేణుల్ని సంతోషించిన వ్యక్తి అవుతారు. ఆ దిశగా లోకేశ్ ఆలోచించాల్సి వుంది.