అరకు పార్లమెంట్ లో కొత్త జిల్లా

ఏపీలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు. ఇది గత ఏడాది జరిగిన ప్రక్రియ. ఇపుడు కొత్తగా మరో జిల్లా రాబోతోంది. అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలను రెండుగా చేస్తూ కొత్త…

ఏపీలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు. ఇది గత ఏడాది జరిగిన ప్రక్రియ. ఇపుడు కొత్తగా మరో జిల్లా రాబోతోంది. అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలను రెండుగా చేస్తూ కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

దేశంలోనే అరకు జిల్లా చాలా పెద్దది. ఇది ఎస్టీ జిల్లా. ఏడు ఎస్టీ నియోజకవర్గాలతో కవర్ అయింది. అలాగే ఆరేడు జిల్లాలలో ఈ ఎంపీ సీటు ఉంది. వందల కిలోమీటర్ల దూరం ఒక్కో నియోజకవర్గానికీ ఉంది. గత ఏడాది జిల్లాల పునర్ వ్యవస్థీకరణ భాగంగా అరకు ఎంపీ సీటుని రెండు జిల్లాలుగా విడగొట్టారు.

ఒక దాన్ని పార్వతీపురం మన్యం జిల్లాగా చేస్తే మరో దాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా చేశారు. మన్యం జిల్లాకు సమస్య లేదు కానీ అల్లూరి జిల్లాతో దూరంగా ఉన్న పోలవరం రంపచోడవరం నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. కలెక్టరేటుకు వెళ్లాలన్నా పాలన కోసం అధికారులను కలవాలన్నా వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

ఈ నేపధ్యంలో గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర కీలక ప్రకటన చేశారు. తొందరలోనే ఒక కొత్త జిల్లాను ఏపీలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అది గిరిజనుల కోసమే అని చెప్పారు. అరకు ఎంపీ సీటు పరిధిలో మరోసారి విభజన జరుగుతుందని తెలుస్తోంది. పోలవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుందని తెలుస్తోంది. 

దీంతో ఏపీలో ఇరవై ఏడు జిల్లాలుగా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలోనే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. అయితే అప్పట్లో అనేక డిమాండ్లు ముందుకు రావడంతో వాయిదా వేశారు. ఇపుడు సరైన సమయం చూసుకుని కొత్త జిల్లా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. తెర వెనక దీనికి సంబంధించి పూర్తి కసరత్తు సాగుతోంది.