చంద్రబాబుకు ఎడా పెడా

రాజకీయాల్లో ఒకటి అంటే నాలుగు తినాల్సి వస్తుంది. చాలాకాలానికి విశాఖ వచ్చిన చంద్రబాబుకు తమ్ముళ్లు బాగానే స్వాగతం పలికారు. పార్టీ తరఫున ప్రాంతీయ సదస్సు పెట్టుకున్నారు. ఈ సదస్సులో తెలుగుదేశం గురించి చెప్పిన దాని…

రాజకీయాల్లో ఒకటి అంటే నాలుగు తినాల్సి వస్తుంది. చాలాకాలానికి విశాఖ వచ్చిన చంద్రబాబుకు తమ్ముళ్లు బాగానే స్వాగతం పలికారు. పార్టీ తరఫున ప్రాంతీయ సదస్సు పెట్టుకున్నారు. ఈ సదస్సులో తెలుగుదేశం గురించి చెప్పిన దాని కంటే జగన్ని బాబు తిట్టిపోసినదే ఎక్కువగా ఉందని అంటున్నారు.

జగన్ ఓడిపోతాడని పదే పదే బాబు చెబుతూ ఆత్మానందం పొందారని వైసీపీ నేతలు అంటున్నారు. దీని మీద వైసీపీ మంత్రులు అయితే బాబుకు గట్టిగానే కౌంటర్లిచ్చారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ బాబుది నోరా తాటిమట్టా అంటూ మండిపడ్డారు. అబద్ధాలు అలవోకగా చెబుతూ ఎవరిని మభ్యపెడతారు అని విమర్శించారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద బాబు చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉత్తరాంధ్రా నిజంగా బాగుపడింది అంటే నాడు వైఎస్సార్ హయాంలోనూ ప్రస్తుతం జగన్ పాలనలోనూ అని బొత్స అంటున్నారు. చంద్రబాబు ఏమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రుషికొండ మీద ప్రభుత్వ కట్టడాలను నిర్మించి అభివృద్ధి చేస్తూంటే బోడి కొండ అని అబద్ధాలు చెప్పడమేంటి బాబూ అని నిలదీశారు.

దేశంలోనే అత్యధిక జీడీపీ కలిగిన రాష్ట్రం ఏపీ అని ఆయన గుర్తు చేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచిన ప్రభుత్వం జగన్ ది అని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఈ నాలుగు విషయాల మీద రాజీ లేకుండా ఖర్చు చేస్తున్న తమ ప్రభుత్వాన్ని నిందించడమేంటని అన్నారు. గ్రామాలకు వెళ్ళి బాబు ఈసారి ఓట్లు తెచ్చుకోగలరా అని సవాల్ చేశారు.

ఎన్నికలు తొందరగా వస్తాయని ఉబలాటపడుతున్న చంద్రబాబుకు ఎవరి పని అయిపోతోందో బాగా తెలుస్తుందని బొత్స సెటైర్లు వేశారు. పేదల ఆకలితో కూడా రాజకీయం చేసే నాయకుడు బాబు అని ఘాటైన విమర్శలు చేశారు. మరో మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే హుదూద్ తుఫాన్ ని నేనే ఆపాను అని డబ్బాలు కొడుతున్న బాబు ఆ హుదూద్ ని అడ్డం పెట్టుకుని విశాఖ కలెక్టరేట్ లో విలువైన భూ రికార్డులు అన్నీ ఎలా మాయం చేయగలిగారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాంధ్రాలో స్టేట్ గెస్ట్ హౌస్ ని నిర్మించడానికి కూడా వీలు లేదని కోర్టుకెళ్ళిన బాబు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. విశాఖ రాజధానిని అడ్డుకుని ఉత్తరాంధ్రాకు ద్రోహం చేస్తున్న బాబుకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఇలా బాబుకు ఇద్దరు మంత్రులు ఎడా పెడా కౌంటర్లిచ్చేశారు.