సరిగ్గా 3 వారాలు.. ఏజెంజ్ నిలదొక్కుకుంటాడా?

నెలాఖరుకు ఏజెంట్ వస్తాడా రాడా? ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ, ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. స్వయంగా అఖిల్ రంగంలోకి దిగాడు. ఇంటర్వ్యూలు ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. దీనికోసం ఏజెంట్ వాతావరణాన్ని తలపించేలా…

నెలాఖరుకు ఏజెంట్ వస్తాడా రాడా? ఈ ప్రశ్నలకు చెక్ పెడుతూ, ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. స్వయంగా అఖిల్ రంగంలోకి దిగాడు. ఇంటర్వ్యూలు ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. దీనికోసం ఏజెంట్ వాతావరణాన్ని తలపించేలా ఓ చిన్నపాటి సెట్ ను కూడా ఏర్పాటుచేశారు.

అంతా బాగానే ఉంది కానీ, కేవలం 3 వారాల్లో ఈ సినిమాను ఎంతమందికి రీచ్ చేయగలరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకే 2 నెలల ముందు నుంచి ప్రచారం మొదలుపెడుతున్న రోజులివి. ఇక పాన్ ఇండియా రిలీజ్ అంటే, ఆ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో, తాజాగా దసరా సినిమాతో అందరం చూశాం.

ఏజెంట్ కూడా పాన్ ఇండియా సినిమానే. పైగా అఖిల్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా రిలీజ్ మూవీ ఇదే. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ 3 వారాల్లో ఇన్ని భాషల్ని కవర్ చేసేలా ప్రచారం చేయగలరా? ఇదే ఇక్కడ డిస్కషన్ పాయింట్.

ఏజెంట్ చిన్న సినిమా కాదు. అఖిల్ మార్కెట్ తో సంబంధం లేకుండా, భారీగా డబ్బులుపెట్టి తీసిన బడా చిత్రం. ఇలాంటి సినిమాతో రికవరీ అవ్వాలంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు కనీసం 2 నెలల నుంచి పక్కా ప్లానింగ్ తో ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ సంప్రదాయ పద్ధతిలో లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ, ఇప్పుడు సిసలైన ప్రచారంలోకి అడుగుపెట్టారు.

ఇప్పటికైనా ఏజెంట్ ప్రచారాన్ని మొదలుపెట్టినందుకు అక్కినేని ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తోంది ఏజెంట్.